ఓటమితో మొదలెట్టారు

Virat
- బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యం - వామప్ మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఓడిన భారత్ - మరో 4 రోజుల్లో ప్రపంచ కప్
లండన్: విశ్వ సమరానికి ముందు భారత క్రికెట్ జట్టుకు కనువిప్పు లాంటి పరాజయం. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన తొలి వామప్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ సమిష్టిగా విఫలమవడంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన కివీస్ పేసర్లు బౌల్ట్ (4/33), నీషమ్ (3/26) ధాటికి 39.2 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా (54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. తక్కువ స్కోర్లను కాపాడుకోవచ్చుఅని కోహ్లీ పదే పదే అంటున్న మాటలను నిజం చేయాలనుకున్నారేమో మన బ్యాట్స్‌మెన్ ఒకరి వెంట ఒకరు పెవిలియన్ బాట పట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో రాస్ టేలర్ (71), కెప్టెన్ విలియమ్సన్ (67) హాఫ్‌సెంచరీలతో చెలరేగడంతో న్యూజిలాండ్ 37.1 ఓవర్లలో 4 వికెట్లకు 180 పరుగులు చేసి గెలిచింది. మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 12 పరుగుల తేడాతో గెలిచింది. స్మిత్ (116) సెంచరీతో చెలరేగడంతో మొదట ఆసీస్ 9 వికెట్లకు 297 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 285 పరుగులకే ఆలౌటైంది. విన్స్ (64), బట్లర్ (52) అర్ధ సెంచరీలు చేశారు.

ఒకరి వెంట ఒకరు..

స్వింగ్‌కు అనుకూలించే పరిస్థితుల్లో కివీస్ బౌలర్లు చెలరేగడంతో భారత్ బ్యాటింగ్ లైనప్ సైకిల్ స్టాండ్‌ను తలపించింది. రెండో ఓవర్‌లో రోహిత్ (2) నిష్క్రమించడంతో ప్రారంభమైన వికెట్ల పత నం ఇక ఏ దశలోనూ ఆగలేదు. ధవన్ (2), రాహుల్ (6) ఇలావచ్చి అలా వెళ్లగా.. కోహ్లీ (18), పాండ్యా (30), ధోనీ (17) మంచి ఆరంభాలను వినియోగించుకోలేకపోయారు. కార్తీక్ (4), భువనేశ్వర్ (1) నిరాశ పరిచారు. దీంతో టీమ్‌ఇండియా 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కుల్దీప్ (19) అండతో జడేజా చెలరేగాడు. గాయాల నుంచి కోలుకుంటున్న శంకర్, జాదవ్ ఈ మ్యాచ్‌లో ఆడకపోగా.. మిగిలిన 13 మందిలో 8 మంది అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ బరిలో దిగినా.. ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజులో నిలదొక్కుకునేందుకు యత్నించలేదు.

కివీస్ ఆడుతూ పాడుతూ..

స్వల్ప లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఎక్కడా తడబడలేదు. ఆరంభంలో మున్రో (4), గప్టిల్ (22) ఔటైనా.. విలియమ్సన్, టేలర్ ఏమాత్రం ఇబ్బంది పడలేదు. మూడో వికెట్‌కు 114 పరుగులు జతచేసి విజయాన్ని ఖాయం చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, పాండ్యా, చహల్, జడేజా తలా ఓ వికెట్ పడగొట్టారు.