లక్నవరానికి కొత్త సొబగులు.. రెండో వేలాడే వంతెన ప్రారంభం

జింకల పార్కు నుంచి లక్నవరానికి రైల్వే ట్రాక్‌కు ప్రతిపాదనలు టూరిజం ఎండీ మనోహర్‌రావు జయశంకర్ భూపాలపల్లి: పర్యాటకంగా విరాజిల్లుతున్న లక్నవరానికి మరిన్ని కొత్త సొబగులు రానున్నట్లు తెలంగాణ టూరిజం ఎండీ బోయినపల్లి మనోహర్‌రావు అన్నారు. గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు వద్ద రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రెండో వేలాడే వంతెనను ఇవాళ‌ మధ్యాహ్నం వంతెన నిర్మాణ రూపకర్త భరద్వాజతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టానికి లక్నవరం తలమానికంగా మారిందన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం నూతనంగా 22 కాటేజీలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జింకల పార్కు నుంచి లక్నవరం సరస్సు వరకు రైల్వే ట్రాక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే రైలును ప్రారంభిస్తామని తెలిపారు. లక్నవరం సందర్శనకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు కూడా వస్తున్నారని, అందుకనుగుణంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట టూరిజం ఓఎస్‌డీ వేణు, సురేందర్, బాలకృష్ణ, నాథన్, శాంతి, డీఈలు ఏకాంబరం, రామకృష్ణ, సూర్యకిరణ్, హరిత, లక్నవరం యూనిట్ మేనేజర్‌లు అశోక్‌రెడ్డి, కిరణ్‌తోపాటు పలువురు ఉన్నారు.

Related Stories: