పోరాడటం కాదు.. గెలవడం నేర్చుకోవాలి!

సౌథాంప్టన్: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పిన మాటలివి. ప్రతిసారీ విజయానికి దగ్గరగా వచ్చి ఆగిపోవడంపై కోహ్లి అసంతృప్తి వ్యక్తంచేశాడు. విదేశాల్లో గట్టి పోటీ ఇస్తున్నామని చెప్పుకోవడం కాదు.. గెలవడమూ నేర్చుకోవాలని అతను టీమ్‌కు సూచించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో 60 పరుగుల తేడాతో ఓడిపోయిన ఇండియా.. సిరీస్‌ను 1-3తో చేజార్చుకున్న విషయం తెలిసిందే. మేం మంచి క్రికెట్ ఆడామని తెలుసు. కానీ ప్రతిసారీ మేం పోటీనిచ్చాం అని చెప్పుకోవడం సరికాదు. విజయానికి దగ్గరగా వచ్చినపుడు.. దానిని అందుకోవడం కూడా నేర్చుకోవాలి. మాకు సామర్థ్యం ఉంది. అందుకే ప్రతిసారీ విజయానికి చేరువగా వస్తున్నాం. ఒత్తిడిలో ఎలా ఆడాలన్నదే ఇప్పుడు మేం దృష్టిసారించాల్సిన విషయం అని కోహ్లి మ్యాచ్ తర్వాత అన్నాడు.

ఇక విదేశాల్లో సిరీస్‌ను దూకుడుగా ప్రారంభించాల్సిన అవసరాన్ని కూడా కోహ్లి నొక్కి చెప్పాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో అద్భుతంగా ఆడారు. అదే సిరీస్ తొలి టెస్ట్‌లోనే ఆడితే ఫలితం మరోలా ఉంటుంది. సౌతాఫ్రికాలోనూ సిరీస్ కోల్పోయిన తర్వాత మేల్కొన్నాం. ఇక్కడా అదే జరిగింది అని కోహ్లి చెప్పాడు. సిరీస్‌లో బ్యాట్స్‌మెన్ వైఫల్యంపైనా అతను స్పందించాడు. సాధ్యమైనంత వరకు బ్యాట్స్‌మెన్ వాళ్ల అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించారని కోహ్లి అన్నాడు. అయితే ఇంగ్లండ్ విజయం సాధించడం కోసం శ్రమించిన విషయాన్ని గుర్తు చేశాడు. సొంతగడ్డపై ఇండియాకు ఇంత దగ్గరగా వచ్చిన టీమ్స్ లేవు. కానీ మేం విదేశాల్లో ఆ టీమ్స్ విజయం కోసం చెమటోడ్చేలా చేస్తున్నాం. ఇది మాలో కచ్చితంగా ఆత్మవిశ్వాసాన్ని నింపేదే అని కోహ్లి స్పష్టంచేశాడు.

Related Stories: