20 శాతం తక్కువ ధరకే రాఫెల్ కొన్నాం..

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి చోటుచేసుకుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. అయితే ఆ అంశంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కుదిరిన డీల్ కన్నా.. రాఫెల్ యుద్ధ విమానాలను తమ ప్రభుత్వం 20 శాతం తక్కువ ధరకే కొనుగోలు చేసిందని జైట్లీ తెలిపారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైట్లీ ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి స్థాయి యుద్ధవిమానంగా రాఫెల్ భారత్‌కు వస్తుందని ఆయన తెలిపారు. రాఫెల్ కొనుగోలులో ఎటువంటి అవకతవకలు జరగలేదన్నారు. రాఫెల్ కొనుగోలుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో జైట్లీ ఆ అంశంపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. బేసిక్ ఎయిర్‌క్రాఫ్ట్ బదులుగా తాము లోడెడ్ విమానాన్ని కొనుగోలు చేస్తున్నామని జైట్లీ చెప్పారు. 2007 నుంచి ఇప్పటి వరకు తయారీ ధరలు కూడా విపరీతంగా పెరిగాయన్నారు. 2007లో కుదిరిన ఒప్పందానికి, 2015లో జరిగిన ఒప్పందానికి చాలా తేడా ఉంటుందని మంత్రి తెలిపారు. ఎక్కువ ధర పెట్టి రాఫెల్‌ను కొన్నారని రాహుల్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని జైట్లీ అన్నారు. రాఫెల్ ధరపై రాహుల్ పలు మార్లు పలు రకాలుగా మాట్లాడరని జైట్లీ విమర్శించారు. యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఎటువంటి నియమావళిని ఉల్లంఘించలేదని, క్యాబినెట్ కమిటీ ఆమోదం జరిగిన తర్వాతే డీల్ కుదిరిందన్నారు. దానికి కూడా 14 నెలల సమయం పట్టిందన్నారు.

Related Stories: