సిద్ధూని జైల్లో వేస్తారా?

న్యూఢిల్లీ: పంజాబ్ మంత్రి నవ్‌జోత్ సింగ్ సిద్ధూ జైలు జీవితం గడపనున్నారా? 20 సంవత్సరాల క్రితం నమోదైన ఓ కేసులో బాధిత కుటుంబం పిటిషన్ మేరకు సిద్ధూపై సుప్రీంకోర్టు తిరిగి విచారణ చేపట్టింది. ఓ వ్యక్తిని కార్లోంచి లాగి సిద్ధూ అతడి స్నేహితుడు ఇద్దరూ కలిసి కొట్టారు. చికిత్స పొందుతూ బాధితుడు అనంతరం మృతిచెందాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు సిద్ధూ అతడి స్నేహితుడు రూపిందర్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రయల్ కోర్టు వీరిపై నమోదైన అభియోగాలను కొట్టివేయగా పంజాబ్, హర్యానా హైకోర్టు వీరిని దోషులుగా పేర్కొంటూ 2006లో మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రథమార్థంలో జస్టిస్ ఛలమేశ్వర్, సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం ఈ కేసులో తీర్పును వెలువరించారు. బాధితుడి మరణానికి సిద్ధూయే కారణమని పేర్కొనే ఆధారాలేవి బలంగా లేవని పేర్కొంటూ వెయ్యి రూపాయలను జరిమానాగా విధించింది. ఈ తీర్పుపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన బెంచ్ ఈ కేసులో మిమ్మల్ని ఎందుకు కఠినంగా శిక్షించవద్దో తెలపాల్సిందిగా పేర్కొంటూ సిద్ధూకు సమన్లు పంపింది.

Related Stories: