ఆస్ట్రేలియాలో పోలింగ్‌.. జోరుగా ఓటింగ్‌

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలో ఇవాళ జాతీయ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. సుమారు 16.4 మిలియ‌న్ల ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. దిగువ స‌భ‌తో పాటు ఎగువ స‌భ‌లో స‌గం సీట్ల కోసం ఓటింగ్ జ‌రుగుతున్న‌ది. ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ నేతృత్వంలోని లిబ‌ర‌ల్ నేష‌న‌ల్ కూట‌మి మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల బిల్ షార్టెన్ నేతృత్వంలోని లేబ‌ర్ పార్టీ నుంచి కూట‌మికి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతున్న‌ది. ఇవాళ ఉద‌యం నుంచే ఓట‌ర్లు భారీ సంఖ్య‌లో ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. క్యాన్‌బెరాలో ఇవాళ ఉద‌యం 8 గంట‌ల‌కు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఆస్ట్రేలియాలో ప్ర‌తి మూడేళ్ల‌కు ఒక‌సారి జాతీయ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. ప్ర‌తి పౌరుడూ ఓటింగ్‌లో త‌ప్ప‌నిస‌రిగా పాల్గోవాల్సి ఉంటుంది. ఆసీస్ ఓట‌ర్లు ప్ర‌ధానంగా వాతావ‌ర‌ణ మార్పునే త‌మ ఎజెండాగా భావిస్తున్నారు. ఈసారి ఆస్ట్రేలియాలో ఉష్ణోగ్ర‌తులు స్థానికుల‌ను ఇబ్బందిపెట్టాయి. అనేక చోట్ల క‌రువు తాండ‌వించింది. అధిక స్థాయిలోనూ ఉష్ణోగ్ర‌తలు న‌మోదు అయ్యాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ స‌న్న‌గిల్లింది. వాతావ‌ర‌ణ మార్పులు, ప‌న్ను అంశాలే ఆసీస్ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తున్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు.