సూపర్‌సోనిక్ పారాచూట్‌ను పరీక్షించిన నాసా

వాషింగ్టన్, సెప్టెంబర్ 8: అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా) మార్స్ 2020 మిషన్‌లో భాగంగా శుక్రవారం పారాచూట్‌ను పరీక్షించింది. దీనిని అడ్వాన్స్‌డ్ సూపర్‌సోనిక్ పారాచూట్ ఇన్‌ఫ్లెక్షన్ రీసెర్చ్ ఎక్స్‌పరిమెంట్ (ఏస్‌పీఐఆర్‌ఈ) లేదా సూపర్‌సోనిక్ పారాచూట్ అని పిలుస్తున్నారు. దీనిని కాలిఫోర్నియాలోని నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీలో తయారుచేశారు. అంగారకుడి వాతావరణంలో ఉన్న కఠిన పరిస్థితులను తట్టుకుంటూ రోవర్‌ను ఉపరితలానికి చేర్చేలా దీనిని తీర్చిదిద్దారు. ఈ పారాచూట్‌ను ఓ రాకెట్ సాయంతో వర్జీనియాలోని వాల్లోప్ప్ ైఫ్లెట్ ఫెసిలిటీ నుంచి ఆకాశంలోకి తీసుకెళ్లి పేలోడ్‌తో సహా కిందికి వదిలారు. అది వాల్లోప్స్ ద్వీపానికి 28 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్ సముద్రంలో సురక్షితంగా దిగిందని నాసా ప్రకటించింది. పారాచూట్‌ను స్వాధీనం చేసుకున్నామని, దాని గమనాన్ని విశ్లేషిస్తామని తెలిపారు. మార్స్ 2020 రోవర్‌ను నాసా 2020 జూలై లేదా ఆగస్టులో ప్రయోగించాలని భావిస్తున్నది. ఆ సమయంలో భూమి, అంగారకుడి మధ్య దూరం తక్కువగా ఉంటుందని పేర్కొన్నది. అంగారకుడిపై జీవానుకూల పరిస్థితులు, సూక్ష్మజీవుల మనుగడకు సంబంధించిన ప్రశ్నలకు ఈ మిషన్‌తో సమాధానాలు దొరుకుతాయని నాసా భావిస్తున్నది.

Related Stories: