టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో నర్సంపేట కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రజల ఆంకాంక్షలకు తూట్లు పొడిచింది. విద్యార్థుల బలిదానాలకు కాంగ్రెస్సే కారణం. గతంలో ఇందిరాగాంధీ కూడా తెలంగాణ ప్రజల ఆంకాంక్షలను తుంగలో తొక్కారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు అభివృద్ధి చేసినం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రజెక్టుల నిర్మాణం చేపట్టినం. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కేసులు వేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అద్భుతమైన ప్రాజెక్టు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు ఇచ్చేందుకు పాలమూరు ప్రాజెక్టు చేపట్టాం. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటిచేసిన వారు ఈ ప్రాజెక్టుపై కేసులు వేశారు. చనిపోయిన వారి స్థానంలో దొంగ వేలిముద్రలతో కేసులు వేశారు. నీళ్ల విషయంలో కర్ణాటక, తమిళనాడులో రాజకీయాలకు అతీతంగా ఒక్కటైనారు. కాని మన దగ్గర మాత్రం నీళ్లు ఇస్తామంటే కేసులు వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆపాలని, చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాసిండు. అలాంటి చంద్రబాబుతో తెలంగాణను ఆఖరివరకు అడ్డుపడ్డ వాడితో కోదండరాం ఎట్లా పొత్తు పెట్టుకుంటాడని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామంటున్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎందుకు ఒకేసారి రుణమాఫీ చేయలేదని ప్రశ్నించారు. మనం ఇచ్చిన హామీలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రెండింతలు హామీ ఇస్తున్నాడు. ఉత్తమ్ హామీలు చూస్తుంటే దక్షిణాది రాష్ర్టాల బడ్జెట్ అంతా ఖర్చు చేసినా సరిపోదు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది. టీడీపీ కాంగ్రెస్‌కు తోకపార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. బషీర్‌బాగ్, ముదిగొండలో రైతులను కాల్చి చంపినోళ్లు ఒక్కటవుతున్నరు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న సీఎం కేసీఆర్ ఒకవైపు ఉన్నారు. మాకు ప్రజలే అధిష్టానం. మాకు అధిష్టానం ఢిల్లీలో లేదు. నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు.

Related Stories: