పూర్తి అదుపులో శాంతిభద్రతలు

-రాష్ట్రంలో మావోయిస్టుల ఘటనలకు తావేలేదు -మన పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు -హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి -ఏరియల్ వ్యూ ద్వారా నిమజ్జన పరిశీలన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, తెలంగాణ జిల్లాల్లో మావోయిస్టు దాడులకు అవకాశమే లేదని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టంచేశారు. మన పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పక్కా నిఘా ఉన్నదని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం హోంమంత్రి నాయిని గణేశ్ నిమజ్జనాలను డీజీపీ మహేందర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో కలిసి హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఏపీలోని అరకు ఎమ్మెల్యే హత్యపై సంతాపం తెలిపిన నాయిని, తెలంగాణలో అలాంటి ఘటనలకు తావులేదన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి నిత్యం అన్ని జిల్లాల ఎస్పీలతో సంప్రదింపులు చేస్తూ, నిఘాను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు సైతం ఎంతో ప్రశాంత వాతావరణంలో ముగిశాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడా ఏ చిన్న హింసాత్మక ఘటనలకు తావులేకుండా పనిచేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల పాలనతో గణేశ్ నవరాత్రుల నిర్వహణలో ఎంతో టెన్షన్ వాతావరణం ఉండేదని, కానీ స్వరాష్ట్రంలో ముందస్తు ప్రణాళికలతో శాంతియుత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించడం సాధ్యమైందన్నారు. ఇందులో పోలీస్‌తోపాటు అన్ని శాఖల అధికారుల భాగస్వామ్యం ఉన్నదని అభినందించారు. శాంతియుత వాతావరణంలో పండుగలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నందుకు అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిమజ్జనం పర్యవేక్షణ

డీజీపీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమాలను డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు సహా 31 జిల్లాల్లోని గణేశ్ నిమజ్జన పాయింట్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రల్ సెంటర్‌తో అనుసంధానించారు. దీని ద్వారా ఆయా జిల్లాల్లో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాలను పరిశీలిస్తూ, సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

Related Stories: