సన్‌డే .

నాగర్‌కర్నూల్ టౌన్ : ఈ వేసవిలో ఎండలు ముదిరిపోతున్నాయి. గతవారం రోజులుగా ఎప్పుడు లేనంతగా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేకుంటుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. 43 డిగ్రీలకు చేరుకొని ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత కారణంగా ఉక్కపోత మొదలవుతుంది. మండే ఎండల కారణంగా ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. జిల్లాలో వేసవి ప్రభావం రోజురోజుకు పెరుగుతూ పోతోంది. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయి గరిష్టస్థాయికి చేరుకుంటున్నాయి. గత శనివారం జిల్లాలోని పలు గ్రామాల్లో 41.8 నుంచి 43.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా గత శనివారం నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తిలో 43.2 డిగ్రీలు, ఊర్కొండలో 42.9 డిగ్రీలు, బిజినేపల్లి మండలం మంగనూర్‌లో 42.5 డిగ్రీలు, బిజినేపల్లిలో 42.5 డిగ్రీలు, సిరిసనగండ్ల, చారగొండ గ్రామాల్లో 42.4, కల్వకుర్తి మండలం తోటపల్లిలో 42.4, కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో 42.2, పదర మండలం వంకేశ్వరంలో 42.0, అచ్చంపేటలో 41.9, కల్వకుర్తిలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళన చెందారు. బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎండల వల్ల వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్లపై చిరువ్యాపారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. మండే సూర్యుడి వేడికి తట్టుకోలేక ఏదోరకంగా తలదాచుకుంటున్నారు. వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు అవస్థలు వర్ణణాతీతం. ఉక్కపోతతో ఇళ్లలోనూ ఉండలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ఎప్పుడు లేనంతగా ఈసారి 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో మున్ముందు పరిస్థితి ఏమిటని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అత్యవసరం అయితే తప్పా బయటకు వెళ్లవద్దని పలువులు డాక్టర్లు పేర్కొంటున్నారు.

Related Stories: