కౌంటింగ్‌కు సిద్ధం

- రేపు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు - 900మంది సిబ్బంది నియామకం
నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: గత40రోజుల ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్‌కు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పోలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. ఈమేరకు కౌంటింగ్ ప్రక్రియపై పూర్తి వివరాలను పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీధర్ నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. నుంచి ప్రారంభిస్తాం. రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడిస్తాం. సువిధ యాప్‌లో నమోదు చేసిన ఫలితాలను ప్రజలు స్మార్ట్‌ఫోన్ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. లాటరీ పద్ధతిలో 5 వీవీ ప్యాట్ ఫలితాలను లెక్కించిన తర్వాతే తుది ఫలితాలను, విజేతను ప్రకటించడం జరుగుతుంది. అనుమతి ఉన్న వ్యక్తులకు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తూ పార్లమెంట్ ఫలితాలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పార్లమెంట్ ఎన్నికల నోడల్ అధికారి, నాగర్‌కర్నూల్ కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన నమస్తే తెలంగాణతో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వెల్లడికి తీసుకున్న చర్యలను వివరించారు. నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు ఎలాంటి ఏర్పాట్లు చేపట్టారు...? పార్లమెంట్ ఎన్నికల అధికారి: నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు గురువారం ఉదయం 8గంటల నుంచి ప్రారంభిస్తాం. మొత్తం 11మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ కౌంటింగ్ కోసం సిబ్బంది నియామకం చేపట్టాం. మాక్ కౌంటింగ్ ద్వారా సిబ్బందికి అవగాహన కల్పిస్తాం. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశాం. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌తో ప్రారంభించి వీవీ ప్యాట్ ఫలితాలతో సరిపోల్చుకొన్న తర్వాత పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడించడం జరుగుతుంది. అప్పుడే విజేత ఎవరనేది అధికారికంగా స్పష్టం చేస్తాం. నమస్తే: కౌంటింగ్‌కు ఎన్ని టేబుళ్లు.., ఎంత మంది సిబ్బంది నియామకం చేశారు...? పార్లమెంట్ ఎన్నికల అధికారి: ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు గాను 14టేబుళ్లను నియమించాం. ఒక టేబుల్‌లో ఒక ఆర్‌ఓ, ఏఆర్‌ఓ ఉంటారు. మిగతా టేబుళ్లలో ఒక కౌంటింగ్ సూపర్వేజర్, సహాయ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్‌తో పాటుగా పోటీ చేసిన అభ్యర్థుల తరపున ఒక ఏజెంట్ ఉంటారు. నాగర్‌కర్నూల్ సెగ్మెంట్ వద్ద పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉండటం వల్ల అదనంగా ఒక ఏజెంట్‌తో కలిపి 351మంది ఉంటారు. వీరితో పాటుగా ఈవీఎంలు తీసుకొచ్చే సిబ్బంది, ఇతరులు కలిపి మొత్తం 900మంది వరకు కౌంటింగ్ ప్రక్రియలో భాగమవుతారు. నమస్తే: ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఫలితాలు ఎక్కడ లెక్కిస్తున్నారు...? పార్లమెంట్ ఎన్నికల అధికారి: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోనే లెక్కింపు ఉంటుంది. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ సెగ్మెంట్ల ఫలితాలు నెల్లికొండ శివారులోని మార్కెట్ గోదాం వద్ద, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, అలంపూర్ ఫలితాలు ఉయ్యాలవాడ శివారులోని మోడర్న్ బిఈడీ కళాశాల కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు ఉంటుంది. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి మాత్రం నెల్లికొండ కేంద్రం నుంచే ప్రకటిస్తాం. గద్వాల, వనపర్తి ఎస్పీల ఆధ్వర్యంలో మోడర్న్ కళాశాల వద్ద, నెల్లికొండ వద్ద నాగర్‌కర్నూల్ ఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఉంటుంది. నమస్తే: రౌండ్, రౌండ్‌కు మధ్యన సమయం ఎంత...., ఎన్ని రౌండ్లు...అత్యధికంగా రౌండ్లు ఉన్న సెగ్మెంట్ ఏది..? పార్లమెంట్ ఎన్నికల అధికారి: ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 15లక్షల మంది ఓటర్లకు గాను 62.51శాతం చొప్పున 9.92లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. 14టేబుళ్ల ద్వారా లెక్కింపు జరుగుతుంది. ప్రతి సెగెమట్‌కు గరిష్టంగా 19రౌండ్లు ఉంటాయి. గద్వాలకు మాత్రం అత్యధికంగా 22రౌండ్లలో ఫలితాల వెల్లడి ఉంటుంది. ఇక చివరగా 5 వీవీ ప్యాట్ ఓట్ల లెక్కింపు మాత్రం 2నుంచి 3గంటల సమయం పడుతుంది. నమస్తే: కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరిని అనుమతిస్తారు...? పార్లమెంట్ ఎన్నికల అధికారి: కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థి, ఏజెంట్, కౌంటింగ్ సిబ్బంది, గుర్తింపు కార్డులు పొందిన ఐదుగురు మీడియా ప్రతినిధుల బృందాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. విజేత నిర్ణయమయ్యాక అతనితో పాటు నలుగురికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. కౌంటింగ్ కేంద్రంలోనే మంచినీరు, భోజన వసతి ఉంటుంది. మీడియాతో సహా అందరూ ఎలాంటి వాటర్ బాటిళ్లను కూడా తీసుకురావద్దు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ అనుమతి లేదు. కౌంటింగ్ సిబ్బందికి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ప్రత్యేక రంగులతో కూడిన గుర్తింపు కార్డులను జారీ చేశాం. నమస్తే : ఫలితాల వెల్లడికి చేసిన ఏర్పాట్లు...? పార్లమెంట్ ఎన్నికల అధికారి: ఈనెల 23న ఉదయం 6ః30గంటలకు ఇద్దరు పరిశీలకుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలను తెరుస్తాం. ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతుంది. నాగర్‌కర్నూల్ సెగ్మెంట్‌లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది. మిగతా సెగ్మెంట్లలో ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తాం. దీనివల్ల ఒక రౌండ్ ఆలస్యంగా నాగర్‌కర్నూల్ ఫలితాలు వస్తాయి. ఈవీఎంల ద్వారా లెక్కింపు చేశాక ఆర్‌ఓ దగ్గర సరిపోల్చాక ఎన్నికల పరిశీలకులు ధృవీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత నా(కలెక్టర్ శ్రీధర్) ఆమోదంతో సహాయ ఎన్నికల అధికారి సువిధ యాప్‌లో ఫలితాలను అప్‌లోడ్ చేస్తాం. అప్పుడు ఈ ఫలితాలు ఆర్‌ఓ లాగిన్‌లోకి వస్తాయి. దీంతో ఆ ఫలితాలు వెంటనే దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. మోబైల్ స్మార్ట్‌ఫోన్లలో కూడా ఇంటి నుంచే ఈ ఫలితాలను తెలుసుకోవచ్చు. నమస్తే : కౌంటింగ్‌లో సమస్యలు వస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు...? పార్లమెంట్ ఎన్నికల అధికారి: ఈవీఎంల ద్వారా కౌంటింగ్ చేపట్టాక ఎవరైనా 56డీ కింద ఫలితాలపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదు చేస్తే, లేదా ఇద్దరు అభ్యర్థుల మధ్య ఓటింగ్‌లో తేడాపై అనుమానం ఉంటే, ఈవీఎంలు పని చేయకుంటే, ఎవరైనా పోలింగ్‌పై ఛాలెంజ్ చేసి ఉంటే వీవీ ప్యాట్లను లెక్కిస్తాం. ఈవీఎంల సమస్యలు ఉంటే వాటిని వెంటనే ఆర్‌ఓ వద్దకు చేర్చడం జరుగుతుంది. అనంతరం 17-సీ ప్రిసైడింగ్ ఆఫీసర్ డ్యూటీ చార్ట్ ప్రకారం పీఓ రాసి ఇచ్చిన ఓట్ల సంఖ్యతో సరిపోల్చుతాం. అలా ఒక సంఖ్య వద్ద సరిపోయే వరకూ లెక్కింపు చేపడతాం. అలా కూడా స్పష్టత రాకుంటే వీవీ ప్యాట్‌లను పరిగణలోకి తీసుకొని ఫలితాలను వెల్లడిస్తాం.బ్యాటరీలు పని చేయకుంటే బీహెచ్‌ఈఎల్ కంపెనీ రూపొందించిన బ్యాటరీలను అప్పటికప్పుడు బిగించడం జరుగుతుంది. నమస్తే: వీవీ ప్యాట్‌లను ఎప్పుడు లెక్కిస్తారు...? పార్లమెంట్ ఎన్నికల అధికారి: సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎన్నికల కమీషన్ సూచనలకు అనుగుణంగా ఈవీఎంల ద్వారా కౌంటింగ్ పూర్తయ్యాక లాటరీ పద్ధతిలో 5 ఈవీఎంల వీవీ ప్యాట్‌లను లెక్కించడం జరుగుతుంది. వీవీ ప్యాట్‌ల ఫలితాలకు దాదాపుగా 3గంటల సమయం పడుతుంది. ఈ ఫలితాల తర్వాతే విజేతలను ప్రకటిస్తాం. నమస్తే : రాజకీయ పార్టీలకు మీరు ఇచ్చే సలహా...? పార్లమెంట్ ఎన్నికల అధికారి: రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల సందర్భంగా సహకరించినట్లుగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా నిబంధనలు పాటించాలి. కౌంటింగ్ కేంద్రం నుంచి 100మీటర్ల పరిధిలోనే నిలిచి ఉండాలి. ఫలితాల వెల్లడి సమయంలో ఎలాంటి ఉద్రేకాలకు లోనుకాకుండా కార్యకర్తలకు సూచించాలి. పారదర్శకంగా, పకడ్బందీగా చేసే కౌంటింగ్‌కు సహకరించాలి. ప్రజలు కూడా స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఇంటి నుంచే ఫలితాలను చూసే వీలుండటంతో సువిధ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కౌంటింగ్ ఏజెంట్లను అభ్యర్థులు గుర్తింపు కార్డులతో ఉదయం 5గంటల వరకే కౌంటింగ్ కేంద్రాల వద్దకు పంపించాలి.

Related Stories: