వారంతా నిన్న డ్రైవర్లు..నేడు ఓనర్లు

హైదరాబాద్ : తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ముస్లిం నిరుద్యోగ యువత సొంత కార్లు తీసుకొని మురిసిపోయారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు దాటినా ముస్లిం యువతకు ఏ ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పించడంలో చొరవ తీసుకోలేదని, కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలిచ్చి కార్లు అందజేయడం చాలా ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. డ్రైవర్ సాధికారత (డ్రైవర్ ఎంపవర్‌మెంట్ స్కీం) పథకం కింద వివిధ జిల్లాలకు చెందిన 342 మంది డ్రైవర్లను అర్హులుగా ఎంపిక చేసిన మైనార్టీ కార్పొరేషన్ అధికారులు నాంపల్లి హజ్‌హౌస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, హోంశాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డి లబ్ధిదారులకు వాహనాల తాళాలు, కిట్లను అందజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి 3వేల దరఖాస్తులు రాగా..తొలివిడతలో 342 మందిని అర్హులుగా గుర్తించి రూ.7 లక్షల 60 వేల విలువైన స్విఫ్ట్ డిజైర్ కార్లను అందజేశారు. ఇందులో రూ.4.40 లక్షలు సబ్సిడీ కాగా, లబ్ధిదారుడు రూ.50 వేలు మాత్రమే చెల్లించారు. మిగతా రూ.2.70 లక్షలను బ్యాంకులు రుణమందించాయి. కారుతోపాటు ప్రతి డ్రైవరుకు సెల్‌ఫోన్, టూల్‌కిట్,టీ షర్టు, జీపీఆర్‌ఎస్ కిట్‌ను అందజేశారు. అంతేకాదు లబ్ధిదారుడి కుటుంబానికి ఏడాదిపాటు రూ.5 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించారు.

జీవితంలో కూడా అనుకోలేదు: మహ్మద్ ఖుర్షీద్, చాంద్రాయణగుట్ట

15 సంవత్సరాలుగా డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉన్నాను. ప్రయివేట్ వ్యక్తుల వద్ద కార్లు నడుపుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా. ఈ పథకం గురించి తెలుసుకొని దరఖాస్తు చేసుకున్న 8 నెలల్లోనే కారు వచ్చింది. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, ఉపముఖ్యమంత్రి మమామూద్ అలీకి జీవితాంతం రుణపడి ఉంటాను.

ఈ ప్రభుత్వం మరింత కాలం ఉండాలి: సయ్యద్ సిద్దిఖ్, గోల్కొండ

నెలకు రూ.10 వేల జీతంతో డ్రైవర్‌గా జీవితాన్ని ఆరంభించాను. ప్రభుత్వమే మధ్యవర్తిత్వం వహించి లోన్‌తోపాటు సబ్సిడీ కింద సొంత కారును అందించడం జీవితంలో మరచిపోలేని ఘటన పెద్ద చదువులు చదివే ఆర్థిక స్థోమతలేక, స్వయం ఉపాధిని పొందే అవకాశాలు లేని యువకులు చెడుదారిలో పయనిస్తున్నారు.

ఇది ప్రజల ప్రభుత్వం: మహ్మద్ ఇలియాజ్‌ఖాన్, బోరబండ

ట్రావెల్స్‌లో రూ.15 వేల జీతానికి 10 ఏండ్లుగా పనిచేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం మా కుటుంబంలో వెలుగులు నింపింది. నేను కారుకు ఓనర్‌ను అవుతానని ఎప్పడూ ఊహించలేదు. కారును ఇప్పించడం మా కుటుంబంలో ఎవరూ మరిచిపోలేము. ఇది ప్రజల ప్రభుత్వం. మళ్లీ ఈ సర్కారే ఉండాలి.

ముస్లిం సమాజం రుణపడి ఉంటుంది: మహ్మద్ నయీముద్దీన్, నిర్మల్

ఏ ప్రభుత్వం కూడా పేదల కడుపు చూడలేదు. అనేకమంది డ్రైవర్లు రూ.10 వేల జీతం చాలక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక డ్రైవర్‌ను కారుకు ఓనర్‌ను చేయడం నమ్మలేని నిజం. కేసీఆర్ ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. సమయానికి వాయిదా చెల్లిస్తా. అల్లా దయ ఈ ప్రభుత్వానికి ఎప్పడూ ఉండాలి.

Related Stories: