ఇంగ్లిష్ కౌంటీల్లో విజయ్

న్యూఢిల్లీ: పేలవ ప్రదర్శనతో జాతీయ జట్టుకు దూరమైన ఓపెనర్ మురళీ విజయ్..ఇంగ్లిష్ కౌంటీల బాట పట్టాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఎసెక్స్ తరఫున విజయ్ ఆఖరి దశ మ్యాచ్‌లు ఆడబోతున్నాడని బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఎసెక్స్ జట్టు తమ అధికారిక వెబ్‌సైట్‌లో విజయ్ చేరికను ధృవీకరించింది. ఈనెల 10 నుంచి ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా నాటింగ్‌హామ్‌షైర్‌తో జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌లో ఈ టీమ్‌ఇండియా ఓపెనర్ ఆడుతాడు. ఆ తర్వాత సొంతగడ్డ వోర్సెస్టర్‌షైర్‌తో మరో మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని ఎసెక్స్ యాజమాన్యం పేర్కొంది. గత నెల రోజులుగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత్ జట్టులో సభ్యునిగా ఉన్నాను. ఇక్కడ ఆడటాన్ని బాగా ఆస్వాదించాను. కానీ పరుగుల వేటలో విఫలమై జట్టులో చోటు కోల్పోయాను. పిచ్‌లపై మరింత అవగాహన కోసం కౌంటీల్లో ఎసెక్స్ తరఫున ఆడేందుకు తహతహలాడుతున్నా అని విజయ్ అన్నాడు.