ముద్ర లోన్లు ముంచుతాయి.. జాగ్రత్త!

న్యూఢిల్లీ: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఇప్పటికే తాను పార్లమెంటరీ ప్యానెల్‌కు ఇచ్చిన నివేదికలో పెద్ద బాంబే పేల్చారు. బ్యాంకుల అత్యాశ, ప్రభుత్వాల జోక్యం వల్లే మొండి బకాయిలు పెరిగిపోయాయని.. తాను ఎప్పుడో హైప్రొఫైల్ ఫ్రాడ్‌ల జాబితాను పీఎంవోకు పంపించానని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. తాజాగా మరో హెచ్చరిక జారీ చేశారు. అసంఘటిత రంగంలోని చిన్న, సూక్ష్మ తరహా వ్యాపారాలకు లోన్లు ఇవ్వడం బ్యాంకులను మరో సంక్షోభంలోకి నెట్టేసే ప్రమాదం ఉందని రాజన్ స్పష్టంచేశారు. ముద్ర (మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ) లోన్లు, కిసాన్ క్రెడిట్ కార్డు పేర్లతో ఈ లోన్లను బ్యాంకులు జారీ చేస్తున్నాయి. 2015 నుంచి ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ముద్ర లోన్లు ఇస్తున్నారు.

ఇప్పటివరకు ముద్ర కింద ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మొత్తం రూ.6.37 లక్షల కోట్ల రుణాలను ఇచ్చాయి. రుణ లక్ష్యాలను నిర్దేశించడం, రుణాలు మాఫీ చేయడంలాంటి పనులను ప్రభుత్వాలు మానుకోవాలని ఈ సందర్భంగా రాజన్ సూచించారు. ముద్ర, కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు చాలా పాపులర్ అయ్యాయి.. అయితే వీటిని అంతే జాగ్రత్తగా పరిశీలించకపోతే కొత్త ముప్పు తప్పదు అని రాజన్ తన నివేదికలో స్పష్టంచేశారు. పంట రుణాలను మాఫీ చేయకూడదన్న అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు సీరియస్‌గా పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని రాజన్ అన్నారు.

Related Stories: