సచిన్, కోహ్లి కాదు.. ఇండియాలో పాపులర్ స్పోర్ట్స్‌పర్సన్ ఎవరో తెలుసా?

న్యూఢిల్లీ: ఇండియాలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు? క్రికెట్‌ను ఓ మతంలా భావించే దేశంలో ఓ క్రికెటరే పాపులర్ అవుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అందులోనూ కాస్త ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. క్రికెట్ గాడ్‌గా అభిమానులు కీర్తించే సచిన్‌గానీ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లిగానీ టాప్ ప్లేస్‌లో లేరు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీయే టాప్‌లో నిలిచాడు. అతని బ్యాటింగ్‌లో మునుపటి వాడి, వేడి లేదని.. కీలక సమయంలో ధోనీ బ్యాటింగ్ చేస్తున్న తీరు దారుణంగా ఉందన్న విమర్శలు తరచూ వస్తున్నా.. ధోనీ పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు.

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తులెవరో తెలుసుకోవడానికి యూగవ్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఇండియా సెక్షన్‌లో ధోనీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ధోనీ స్కోరు 7.7 శాతంగా ఉంది. అంతేకాదు ఓవరాల్‌గా భారత ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత ధోనీ రెండోస్థానంలో నిలిచాడు. ఇక క్రీడాకారుల విషయానికి వస్తే ధోనీ తర్వాత సచిన్ టెండూల్కర్ (6.8 శాతం), విరాట్ కోహ్లి (4.8 శాతం) ఉన్నారు. ధోనీ ఈ మధ్యే వన్డేల్లో పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే.

Related Stories: