ధోనీ కబడ్డీ చూశారా?

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తనకు దొరికిన ఖాళీ సమయాన్ని మరో రకంగా వినియోగించుకుంటున్నాడు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లకు విశ్రాంతినివ్వడంతో ధోనీ ఇప్పుడు షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రో కబడ్డీ లీగ్ ప్రోమో షూటింగ్‌లో ధోనీ పాల్గొంటున్నాడు. పీకేఎల్ ఇప్పటికే ఎంతో విజయవంతమైంది. ఇప్పుడు ధోనీ ప్రమోషనల్ వీడియోతో ఈ లీగ్‌కు మరింత పబ్లిసిటీ దక్కనుంది. ధోనీ కమర్షియల్స్‌ను మేనేజ్ చేసే రితి స్పోర్ట్స్ ప్రొ కబడ్డీ లీగ్ షూట్‌లో అతడు పాల్గొన్న ఫొటోను ట్వీట్ చేసింది. ఈ షూట్‌లో భాగంగా ధోనీ కబడ్డీ ఆడుతున్నట్లుగా కనిపించాడు. వెస్టిండీస్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లకు ధోనీని పక్కన పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడితో అతని టీ20 కెరీర్ ముగిసినట్లే అన్న విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. అయితే యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఇచ్చే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెలక్టర్లు చెప్పారు. రానున్న ఆస్ట్రేలియా టూర్‌లో ధోనీ కేవలం వన్డే సిరీస్‌లో మాత్రమే కనిపించనున్నాడు.

Related Stories: