ధోనీ 20 ఏండ్ల కుర్రాడు కాదు

ముంబై: మహేంద్రసింగ్ ధోనీ 20 ఏండ్ల కుర్రాడు ఏం కాదని, అతన్నుంచి ఇంకా దూకుడైన ఆటతీరును ఆశించడం సరికాదని భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ అన్నాడు. జట్టుకు అతను అనితర సాధ్యమైన సేవలు అందించాడు. 20-25 ఏండ్ల వయస్సులో లాగా తిరిగి ఆడాలంటూ అభిమానులు అంచనాలు పెట్టుకోవడం సరైంది కాదు. అదంతా గతం ఇప్పుడలా ఆడటం కష్టసాధ్యం. కానీ అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగకరం. ధోనీ సలహాలు, సూచనలు జట్టుకు ఓ ఆస్తిలాంటివి. ఫిట్‌నెస్ బాగుంటే మహీ మరిన్ని మ్యాచ్‌లు ఆడాలి అని కపిల్ అన్నాడు. మరోవైపు భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ..ప్రత్యేకమైన వ్యక్తి అని...అద్భుతమైన ప్రతిభకు తోడు కష్టపడే తత్వం కల్గిన క్రికెటర్ అని కపిల్ ప్రశంసించాడు. సమిష్టిగా రాణిస్తూ..వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు టీ-20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఈ క్రికెట్ దిగ్గజం పేర్కొన్నాడు.