ఎన్నికలంటే భయమెందుకు?

-నిశ్శబ్ద విప్లవం ప్రగల్భాలేమయ్యాయి? -ఎన్నికలు ఇప్పుడే వద్దని గోల ఎందుకు? -ప్రతిపక్షాల వైఖరిపై సర్వత్రా విస్మయం -ఈసీ బృందం ఎదుట విపక్షాల సాకులు -ఎన్నికలు వాయిదావేయాలని వినతులు -పండుగలు పబ్బాలంటూ మెలికలు
నమస్తే తెలంగాణ ప్రతినిధి, హైదరాబాద్:శాసనసభ ఎన్నికలపై ప్రతిపక్షాలు ప్లేటు ఫిరాయించాయి. ఎన్నికల సంఘం ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో మంగళవారం రాత్రి జరిగిన సమావేశాల్లో టీఆర్‌ఎస్, ఎంఐఎం తప్ప తక్కిన పార్టీలన్నీ ఎన్నికలు ఇప్పుడే వద్దని వాదించాయి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎంలతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికలకు మరింత సమయం కావాలని కోరాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం, రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తుంది, వంద సీట్లు గెలుస్తాం, టీఆర్‌ఎస్ ప్రభుత్వం పీడ వదలిపోతుంది.. ఇలా రకరకాలుగా బీరాలు పలికిన ప్రతిపక్షాలు తీరా ఎన్నికల మోకా వచ్చేసరికి మాట మార్చాయి. కాంగ్రెస్‌తోసహా అన్ని ప్రతిపక్షాలు బయటికి గంభీర వచనాలు చెప్తూ.. లోపల ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మంగళవారం ఎన్నికల అధికారులతో జరిగిన సమావేశాల్లో తేలిపోయింది.

రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న లిటిగెంటు రాజకీయాలు, కల్మషపూరిత వాతావరణం అంతంకావాలని, అందుకోసం ప్రజల తీర్పు కోరాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అసెంబ్లీని రద్దుచేసి ప్రజల ముందుకు వచ్చారు. మరో తొమ్మిది మాసాల పాలనా సమయాన్ని త్యాగంచేసి ఎన్నికల తీర్పు కోరారు. రాష్ట్రంలో ప్రారంభించిన అభివృద్ధి యజ్ఞం నిరాటంకంగా కొనసాగాలన్నా, అన్ని రంగాల్లో అభివృద్ధి గమనం ఆగకుండా ఉండాలన్నా రాజకీయ స్థిరత్వం అవసరమని, అందుకు తాజాగా ప్రజల తీర్పుకోరడమే ఉత్తమమని ముఖ్యమంత్రి భావించారు. ఈ క్రమంలోనే మంగళవారంనాటి సమావేశంలో తమ వాదనలు వినిపించిన టీఆర్‌ఎస్ నేతలు ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధివైపు అడుగులు వేస్తున్న క్రమంలో పూర్తిస్థాయి అధికారం ఉన్న ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పినట్టు తెలిసింది. అయితే నిన్నటిదాకా బరిగీసి మాట్లాడిన ప్రతిపక్షాలు అకస్మాత్తుగా ఎన్నికలు ఇప్పుడే వద్దని రాగం అందుకున్నాయి. రకరకాల సాకులు చెప్తున్నాయి. సాంకేతిక కారణాల మాటున దాక్కోవాలని చూస్తున్నాయని ఆయా పార్టీల వాదనలు వింటే అర్థమవుతున్నది.

వద్దనటానికి తలా ఒక సాకు!

ఓటర్ల జాబితా సవరణకు నాలుగు నెలల సమయం కావాలి. జనవరిలో సవరణ పూర్తిచేయాలి. ఏడుమండలాల డీలిమిటేషన్ జరుగలేదు. రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి అని కాంగ్రెస్ పక్షాన హాజరైన మర్రి శశిధర్‌రెడ్డి కోరారు. ఓటర్ల నమోదుకు సమయం చాలదు. వినాయకచవితి, నిమజ్జనం, మొహర్రం పండుగలున్నాయి.

పూర్తిస్థాయిలో ఓటర్ల జాబితాల సవరణ తర్వాతనే ఎన్నికలు పెట్టాలి అని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. చవితి, మొహర్రం పండుగలు ఉన్నాయి కాబట్టి షెడ్యూలు వాయిదా వేయాలని కోరాము అని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి చెప్పారు. ఓటర్ల సంఖ్య 30 లక్షలు తగ్గడానికి కారణాలు చెప్పాలి. జాబితాలు లేవు, నక్షాలు లేవు.. ఇంటి నంబర్లు లేవు. పూర్తిగా జాబితా సవరణ జరిగిన తర్వాతనే ఎన్నికలు జరుపాలని కోరాము అని సీపీఎం నేత డీజీ నర్సింహారావు తెలిపారు. పండుగల వల్ల ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకీ ఉండబోదు. రద్దయిన అసెంబ్లీకి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కుండబద్దలు కొట్టడం విశేషం.

పారిపోతున్న ప్రతిపక్షాలు

సాధారణంగా ప్రజల తీర్పును ప్రతిపక్షాలు కోరుతాయి. ఎన్నికలు వస్తున్నాయంటే ప్రతిపక్షాలు ఎగిరి గంతేస్తాయి. వీలైనంత త్వరగా ఎన్నికలు రావాలని, ప్రజల మద్దతు పొందాలని భావిస్తాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ప్రజల మద్దతు కూడగట్టడానికి ఎన్నికలను ఒక అవకాశంగా పరిగణిస్తాయి. తెలంగాణలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతున్నది.

అధికారపక్షమే తమ పాలనాధికారాన్ని ముందే వదులుకొని ప్రజల తీర్పును కోరుతుంటే, ప్రతిపక్షాలేమో పారిపోతున్నాయి! రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవమో, ప్రతికూల పవనాలో ఉంటే ప్రతిపక్షాలు ఎన్నికలను ఎదుర్కోకుండా ఎందుకు భయపడుతున్నాయి? ఎన్నికల బరిని వీలైనంత దూరం వాయిదా వేయించాలని ఎందుకు ఉబలాటపడుతున్నాయి? ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం గత జనవరిలోనే పూర్తిస్థాయిలో ఒకసారి సవరించి ప్రచురించింది. ఇప్పుడు మరోసారి సవరించతలపెట్టింది. ఆ సవరణ ప్రక్రియలో కూడా ఎక్కడా సమయాభావంలేకుండా అందరికీ అవకాశం ఇచ్చింది. ఆ ప్రక్రియను పూర్తిచేసిన తర్వాతనే ఎన్నికల ప్రకటన చేస్తామని ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది.

Related Stories: