వార్ వన్ సైడే: ఎంపీ కవిత

కరీంనగర్: ఎన్నికల్లో వార్ వన్ సైడే.. అని స్పష్టం చేశారు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. ఇవాళ సాయంత్రం ధర్మపురిలోని లక్ష్మీ నరసింహ స్వామిని కవిత దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పైరవీల పార్టీ.. ప్రజా కూటమిలో పేరులోనే ఉంది ప్రజల హృదయాల్లో కూటమి లేదన్నారు. టికెట్ల పంపకాల్లోనే ఇంత గందరగోళం ఉంది.. అభివృద్ధి విషయంలో ఇంకేం చేస్తారు.. అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు బ్యాక్ డోర్ ద్వారా తన కుట్రలను కొనసాగించేందుకే కాంగ్రెస్ తో జత కట్టారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఢిల్లీలో ఫైనల్ చేసి, అమరావతిలో ఒకే చేయించుకుని హైదరాబాదులో ప్రకటించారు. టిక్కెట్లు ఖరారు కోసమే ఢిల్లీ, అమరావతి, హైదరాబాద్ తిరిగిన మహాకూటమి నేతలు తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు అలాగే తీసుకుంటారని చెప్పారు. పొరపాటునో.. గ్రహపాటునో కూటమికి అధికారం ఇస్తే ఏమి చేయలేరనే విషయం అర్థమవుతుందన్నారు. ధర్మపురి టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఓపిక సహనం మాలాంటి ఈ తరం నాయకులకు స్ఫూర్తినిస్తుంది. తెలంగాణ కొంగుబంగారం లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకున్న. ఆలయ అభివృద్ధికి ముఖ్య మంత్రి కెసిఆర్ తో మాట్లాడి మూడేళ్లలో రూ.50 కోట్లు మంజూరు చేయించిన కొప్పుల ఈశ్వర్ పేరు చిరస్థాయిలో నిలిచి పోతుందని ఎంపీ కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని అప్పగించినా బాధ్యతతో, ఓర్పుతో ఆ పనిని పూర్తి చేసే దీక్షాదక్షతలు ఆయన సొంతమన్నారు. సీఎం సహాయనిధి నుంచి అందరికన్నా ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేయించుకున్న ఘనత కూడా ఆయనదే అన్నారు. ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు వెంటపడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను సాధించుకున్నారని, రోళ్ల వాగు ప్రాజెక్ట్ కు రూ.63 కోట్లు మంజూరు చేయించుకున్నారు. పత్తిపాక రిజర్వాయర్ సాధించుకున్నారని ఎంపీ కవిత వివరించారు. ధర్మపురి పట్టణ అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ద్వారా రూ.25 కోట్లను మంజూరు చేయించుకున్న విషయం తెలిసిందే అన్నారు. ఇక్కడ కొప్పుల ఈశ్వర్ నియోజక అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే.. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారని... అందుకే కారు గుర్తుకు ఓటు వేసి.. టీఆర్ఎస్ కు మళ్లీ అధికారం అప్పగించాలని ఎంపీ కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో ధర్మపురి టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల టిఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్, ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి ఆలయం చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.

Related Stories: