విశ్వ వేదికలు

Cricket-Grounds
- మరో 5 రోజుల్లో ప్రపంచ కప్
ఏదైనా బృహత్కార్యం తలపెట్టేముందు.. దానికి సంబంధించిన సూకా్ష్మతి సూక్ష్మమైన విషయాలపై కూడా దృష్టిసారించడం ఆనవాయితీ! పూర్వాపరాలను పరిశీలించి మంచి, చెడు విశ్లేషించుకున్నాకే అడుగు ముందుకేసేది. రామ, రావణ యుద్ధానికి ముందు హనుమంతుడు కూడా ఇదే పనిచేశాడు. ముందు గ్రౌండ్ ఎలా ఉందో సరిచూసి వచ్చి పరిస్థితిని వివరించాకే శ్రీరాముడు కదనానికి సై అన్నాడు. ఏ రంగంలోకైనా అడుగుమోపే ముందు ఆనుపాను చూసుకొని క్షేత్రస్థాయి అవగాహన కోసం గ్రౌండ్ రిపోర్ట్ సిద్ధం చేసుకోవడం పరిపాటి! మరి నాలుగేండ్లకోసారి వచ్చే ప్రతిష్ఠాత్మక వరల్డ్‌కప్‌నకు ఆతిథ్యమిస్తున్న మైదానాల గురించి కూడా తెలుసుకోవాల్సిందే కదా..

లార్డ్స్

రెండు శతాబ్దాల క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రాచీన మైదానంగా గుర్తింపు పొందిన గ్రౌండ్ లార్డ్స్. అభిమానులు ముద్దుగా క్రికెట్ మక్కా అని పిలుచుకునే ఈ మైదానం 135 ఏండ్ల క్రితమే టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చి చరిత్రకెక్కింది. లార్డ్స్ గొప్పతనం గురించి మాటల్లో చెప్పడం కష్టమే. ఏ గ్రౌండ్‌లో సెంచరీ చేస్తే బ్యాట్స్‌మన్ జన్మధన్యమైనట్లు భావిస్తాడో.. ఏ పిచ్‌పై బౌలర్ ఐదు వికెట్లు తీస్తే ఆత్మ సంతృప్తి చెందుతాడో అలాంటి అద్భుత మైదానమే ఇది. భారత అభిమానులకు లార్డ్స్‌తో అనుబంధం అంతాఇంతా కాదు. 1983లో కపిల్ డెవిల్స్ వరల్డ్‌కప్‌ను ముద్దాడింది, నాట్‌వెస్ట్ సిరీస్ విజయం అనంతరం సౌరభ్ గంగూలీ చొక్కావిప్పి సింహనాదం చేసింది ఇక్కడే. ఇంగ్లండ్‌లో ఇప్పటివరకు నాలుగు వరల్డ్‌కప్‌లు జరిగితే ఆ నాలుగుసార్లు ఫైనల్ వేదిక ఇదే. ఈ సారి కూడా ఫైనల్ సహా మొత్తం ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. అయితే లీగ్ దశలో భారత్ ఆడే ఒక్క మ్యాచ్ కూడా ఇక్కడ జరుగకపోవడం మన అభిమానులను నిరాశ పరిచే అంశమే అయినా.. విరాట్ సేన ఫైనల్ చేరితే లార్డ్స్‌లో మ్యాచ్ చూసే చాన్స్ ఉంటుంది. సామర్థ్యం:28,500 మ్యాచ్‌లు: 5 ఫైనల్ సహా Cricket-Grounds1

నాటింగ్‌హామ్

గతేడాది టీమ్‌ఇండియా పర్యటన సందర్భంగా కుల్దీప్ యాదవ్ 6 వికెట్లు పడగొట్టింది ఇక్కడే. పేస్‌తో పాటు స్పిన్‌కూ అనుకూలిస్తుంది. వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదైంది కూడా ఇక్కడే. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఇంగ్లండ్ 481/6 పరుగుల ప్రపంచ రికార్డు నమోదు చేసింది. సామర్థ్యం: 17,000 మ్యాచ్‌లు: 5 Cricket-Grounds2

చెస్టర్‌లిస్ట్రీట్

మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్న చెస్టర్‌లిస్ట్రీట్ మైదానం పేస్‌తో పాటు స్వింగ్‌కు అనుకూలించనుంది. 1999 వరల్డ్‌కప్ నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న ఈ మైదానంలో ఇప్పటివరకు మొత్తం 16 మ్యాచ్‌లు జరిగాయి. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ కావడం భారత్‌కు కలిసొచ్చే అంశమే. సామర్థ్యం: 14 000 మ్యాచ్‌లు: 3 Cricket-Grounds3

ఓవల్ (లండన్)

ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు పుట్టినిల్లు ఓవల్. వంద టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన తొలి మైదానంగానే కాకుండా.. టెస్టు చరిత్రలో తొలి వేదికగా కూడా దీనికి ప్రత్యక గుర్తింపు ఉంది. ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో 10 మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. పేసర్లకు స్వర్గధామం వంటి ఈ పిచ్‌పై బ్యాటింగ్ కష్టమనే చెప్పొచ్చు. సామర్థ్యం: 25,500 మ్యాచ్‌లు: 5 Cricket-Grounds4

మాంచెస్టర్

ఇప్పటి వరకు ఇంగ్లండ్‌లో జరిగిన నాలుగు వరల్డ్‌కప్‌లకు ఆతిథ్యమిచ్చిన మాంచెస్టర్ ఓల్డ్ ట్రఫార్డ్ స్టేడియం ఈసారి ఆరు మ్యాచ్‌లకు వేదిక కానుంది. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై స్వింగ్ రాబట్టగలిగే బౌలర్లు సత్తాచాటే అవకాశం ఉంది. టెస్టు మ్యాచ్‌కు వేదికైన రెండో గ్రౌండ్‌గా ప్రసిద్ధి. వచ్చే నెల 16న పాకిస్థాన్‌తో భారత్ తలపడబోయేది ఇక్కడే. సామర్థ్యం: 24,600 మ్యాచ్‌లు: 6 Cricket-Grounds5

లీడ్స్

లార్డ్స్ తర్వాత పురాతన మైదానంగా గుర్తింపు ఉన్న లీడ్స్ హెడింగ్లే గ్రౌండ్ ఇప్పటి వరకు 12 ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. వాతావరణం మేఘావృతమై ఉండే ఈ ప్రదేశంలో పేసర్లకు పిచ్ నుంచి చక్కటి సహకారం లభించనుంది. ఈ మైదానంలో క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ రెండు ట్రిపుల్ సెంచరీలు చేయడం విశేషం. సామర్థ్యం: 18,350 మ్యాచ్‌లు: 4 Cricket-Grounds6

సౌతాంప్టన్

వరల్డ్‌కప్‌నకు ఆతిథ్యమిస్తున్న అన్ని స్టేడియంలలో ఇటీవల నిర్మించిన మైదానం ఇదే. టీ20 ఫార్మాట్‌లో జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు వేదికగా నిలిచి అరుదైన గుర్తింపు సాధించింది. ఈ సారి 5 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. ఈ మైదానం లో ప్రపంచకప్ మ్యాచ్ జరుగడం ఇదే తొలిసారి కావడం విశేషం. సామర్థ్యం: 17,000 మ్యాచ్‌లు: 5 Cricket-Grounds7

ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హమ్)

సీమ్‌కు పెట్టింది పేరైన ఎడ్జ్‌బాస్టన్ ఇప్పటివరకు ఎన్నో ఉత్కంఠ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. అందులో 1999 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య టైగా ముగిసిన మ్యాచ్ కూడా ఉంది. ఈ మైదానంలో భారత రికార్డు అద్భతంగా ఉంది. మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన టీమ్ ఇండియా ఏడింట గెలిచి 3 మ్యాచ్‌ల్లో ఓడింది. సామర్థ్యం: 24,500 మ్యాచ్‌లు: 5 Cricket-Grounds8

టాంటన్

విశ్వసమరానికి ఆతిథ్యమిస్తున్న అన్ని మైదానాల్లోకెళ్ల తక్కువ సామర్థ్యం కలిగినది టాంటన్. 1999 వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై గంగూలీ (183), ద్రవిడ్ (145) సెంచరీలతో అదరగొట్టడంతో అప్పట్లోనే టీమ్ ఇండియా 373 పరుగుల భారీ స్కోరు చేసింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 318 పరుగులు చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. సామర్థ్యం: 8,000 మ్యాచ్‌లు: 3 Cricket-Grounds9

కార్డిఫ్ (వేల్స్)

కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ క్రికెట్ మైదానం ఈసారి 4 మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనుంది. 1999 వరల్డ్‌కప్ తర్వాత ఇక్కడ ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగలేదు. చివరిసారిగా 2017 చాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌కు ఈ వికెట్ వేదికైంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకంటే లక్ష్యాన్ని ఛేదించే జట్టుకే ఇక్కడ విజయావకాశాలు ఎక్కువ. సామర్థ్యం: 15,200 మ్యాచ్‌లు: 4 Cricket-Grounds10

బ్రిస్టల్

మూడు వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్న బ్రిస్టల్ మైదానం సామర్థ్యం పరంగా చిన్నది. ఈ వేదికపై అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సొంతం. కేవలం 11,000 వేల మంది మాత్రమే చూసే అవకాశం ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు అత్యధికంగా మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగాయి. సామర్థ్యం: 11,000 మ్యాచ్‌లు: 3