ఇరానీకి స్థానచలనం

-శాఖల కేటాయింపులో మోదీ-షా ముద్ర
న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: గత రెండేండ్లలో వివిధ మంత్రిత్వశాఖల పనితీరును సమీక్షించిన ప్రధాని మోదీ, అమిత్ షా, అరుణ్‌జైట్లీలు చివరకు సంతృప్తికరమైన పనితీరు కనబర్చనివారి నుంచి సమర్ధులకు బదిలీ చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీ చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్నాయి. రోహిత్ వేముల అంశం మొదలు తాజాగా నిఫ్ట్ చైర్మన్ నియామకం వరకు స్మృతి ఇరానీపై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. విద్యా వ్యవస్థలో ఆర్‌ఎస్‌ఎస్ సూచనల మేరకు కాషాయీకరణను జొప్పించాలని ప్రయత్నించి మరింత వివాదాస్పదమయ్యారు. చివరకు ఆమె విద్యార్హత కూడా వివాదాస్పదమైంది. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆమె సేవలను వాడుకొనేందుకే కీలకమైన బాధ్యతల నుంచి తప్పించి జౌళి శాఖకు మార్చినట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

వెంకయ్య బాధ్యతలకు కోత:

పార్లమెంట్‌లో పలు కీలకమైన బిల్లులకు ఆమోదం పొందకపోవడంలో వెంకయ్యనాయుడి నుంచి తగిన సామర్థ్యం కనిపించలేదని మోదీ భావించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే ఆయన దగ్గర ఉన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖను తొలగించి రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్‌కు, తాజా మంత్రి ఆహ్లువాలియాకు అప్పగించారు. తెలుగు, హిందీ, ఆంగ్లం భాషల్లో మాట్లాడే వెంకయ్యకు సమాచార శాఖను అప్పగించారు. కానీ పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖలు ఆయనవద్దే ఉన్నాయి. రెండోసారీ గౌడ విఫలం: తొలుత రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సదానందగౌడ తగిన పనితీరు కనబర్చకపోవడంతో న్యాయ శాఖకు బదిలీ అయ్యారు. అక్కడ కూడా ప్రభుత్వం ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవడంతో చివరకు గణాంకాల మంత్రిత్వశాఖకు బదిలీ కావాల్సి వచ్చింది. దీనికి తోడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టు విభజన ప్రక్రియను చేపట్టడంలో ఆయన వ్యవహారం విమర్శలకు దారితీసింది. భవిష్యత్ ఎన్నికలపై దృష్టితోనే మార్పులు: రానున్న రెండేండ్లలో వివిధ రాష్ర్టాల్లో జరిగే ఎన్నికల్లో కొత్త మంత్రుల ద్వారా పనితీరును సాధించి ఓటుబ్యాంకును ఆకర్షించడం మోదీ, అమిత్‌షాల వ్యూహం. అందులో భాగంగానే సత్వరం ప్రజల దగ్గరకు పథకాల అమలు చేర్చడం కోసం కొత్త మంత్రులకు సహాయ మంత్రిత్వశాఖ బాధ్యతలను అప్పగించారు. ఎలాగూ 2019 ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించడమే లక్ష్యంగా ఇప్పుడు కొత్త మంత్రులు తొలిసారి అవకాశం పొందిన ఉత్సాహంతో వేగంగా, చురుగ్గా పనిచేస్తారన్నది కూడా మోదీ ఆలోచన. గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ మంత్రివర్గంలో ఒకేసారి భారీ మార్పులు చేసిన అనుభవాలు కనిపిస్తాయి.

Related Stories: