48 గంటల్లో మోస్తరు వర్షాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కర్ణాటక దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో స్థిరంగా కొనసాగుతున్నది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక పరిసరాలలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని బుధవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఉపరితల ఆవర్తనాల ప్రభావంగా రాగల 48 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్త్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. క్యుములోనింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల 5 నుంచి 7 సె.మీ వరకు వర్షపాతం నమోదైంది. మేడ్చల్ జిల్లా మంచాల, రంగారెడ్డి జిల్లా యాచారంలో 3.2 సెం.మీ. సరూర్‌నగర్‌లో 2సె.మీవాన కురిసింది.