చంద్రబాబు మోసాలను తిప్పికొట్టాలి

మహబూబాబాద్: మహాకుటమి పేరుతో చంద్రబాబు చేస్తున్న మోసాలను తెలంగాణ ప్రజలు మరోసారి తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కేసముద్రం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న చంద్రబాబుతో కాంగ్రెస్ నాయకులు పొత్తు పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ రైతులకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోర్టులలో కేసులు వేస్తూ అడ్డుపడుతున్నాడన్నారు. ఆంధ్రపదేశ్ ప్రభుత్వం బలవంతంగా తీసుకున్న ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను, సీలేర్ పవర్ ప్రాజెక్టును తెలంగాణకు ఇచ్చేస్తానని కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవడానికి వేసిన కేసులను వెనక్కి తీసుకుంటానని చంద్రబాబు నాయుడుతో ప్రకటన ఇప్పిస్తారా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాన్ని కనిపెట్టలేని స్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉండడం సిగ్గు చేటన్నారు. అభివృద్ధి ఆగకూడదనే సీఎం కేసీఆర్ 9 నెలల ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారని, కాంగ్రెస్ నాయకులు 9 నిమిషాలు కూడా పదవిని వదులుకోలేరన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మరో సారి సీఎం కేసీఆర్‌కి అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సీతారాంనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్, టీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.

Related Stories: