ఎమ్మెల్యే కిడారి కాల్చివేత

-విశాఖ మన్యంలో మావోయిస్టుల దుశ్చర్య -మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కూడా హతం -చుట్టుముట్టిన 60 మంది మావోయిస్టులు -గంటసేపు చర్చల అనంతరం ఇద్దరి హత్య -బాక్సైట్ తవ్వకాలు, క్వారీ వివాదమే కారణం? -అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు -కిడారి సర్వేశ్వరరావును కాల్చి చంపిన మావోయిస్టులు -మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘా ముమ్మరం -సంతాపం తెలిపిన గవర్నర్ నరసింహన్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ/కొత్తగూడెం క్రైం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ మన్యం మరోసారి రక్తసిక్తమైంది. మావోయిస్టు లు అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చిచంపారు. ఆదివారం విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడ మండలం లిప్పిట్టిపుట్ట వద్ద ఈ ఘటన జరిగింది. మావోయిస్టుల దాడిని విశాఖపట్నం ఎస్పీ రాహూల్‌దేవ్ నిర్ధారించారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో ఈ దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 60 మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నారని భావిస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఎమ్మెల్యే కిడారిని మావోయిస్టులు గతంలో పలుమార్లు హెచ్చరించారని, ఆయన క్వారీ విషయంలోనూ బెదిరింపులు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. కిడారి సర్వేశ్వరరావు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున అరకు ఎమ్మెల్యేగా గెలిచారు. కొంతకాలం కిందట టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ మృతిపట్ల గవర్నర్ నరసింహన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

గంటపాటు చర్చలు.. ఆపై కాల్పులు

ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ డ్రైవర్ చిట్టిబాబు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఆదివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే సివేరి సోమతో కలిసి నిమిటిపుట్ట గ్రామంలో జరిగే గ్రామదర్శినిలో పాల్గొనేందుకు బయలుదేరారు. ఇద్దరు డ్రైవర్లు, మరో ఆరుగురు కలిసి రెండు కార్లలో వెళ్తుండగా మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో లిప్పిట్టిపుట్ట వద్ద మావోయిస్టులు చుట్టుముట్టారు. వాహనాలు ఆపకుంటే బాంబులతో పేల్చివేస్తామని బెదిరించడంతో ఆగిపోయారు. కొందరు మావోయిస్టులు కారు వద్దకు వచ్చి ఎమ్మెల్యే సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సోమను దించి.. చేతులు వెనక్కి కట్టేశారు. గన్‌మెన్లు, డ్రైవర్లకు తుపాకులు గురిపెట్టి వారి దగ్గర ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కొందరు మావోయిస్టులు వారికి కాపలాగా ఉండగా, మరికొందరు ఇద్దరినీ దూరంగా తీసుకెళ్లారు. తీసుకెళ్లారు. ప్రభుత్వానికి అనుకూలంగా మారి ఏజెన్సీ భూముల్లో బాక్సైట్ తవ్వకాలకు ప్లాన్ చేస్తున్నారా? అంటూ ఇద్దరినీ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కిడారికి చెందిన గూడ క్వారీ పనులతో పర్యావరణానికి నష్టం కలుగుతున్నదని, వెంటనే క్వారీ పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దాదాపు గంటసేపు చర్చించారు. క్వారీ పనులను నిలిపివేసేందుకు ఎమ్మెల్యే ఒప్పుకోలేదు. ఏదైనా సమస్య ఉంటే చర్చలతో పరిష్కరించుకుందామని, ఇలా బెదిరించడం తగదని వారించారు. దీంతో మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇద్దరిపై అతి సమీపం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రగాయాలతో వారిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మావోయిస్టులు తమను విడిచిపెట్టారని డ్రైవర్ చిట్టిబాబు వివరించారు.

భద్రత లేకుండా వెళ్లొద్దని చెప్పినా..

మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకే ఈ హత్యలు చేశారని పోలీసులు భావిస్తున్నారు. గ్రేహౌండ్స్ దళాలు, ఒడిశా పోలీసుల కూంబింగ్‌తో విశాఖ మన్యంలో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇటీవల వారోత్సవాలు జరుపడం, పోస్టర్లు అంటించడం వంటి చర్యలతో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు భద్రత లేకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లొద్దని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అయినా సరైన భద్రత లేకుండా గ్రామ పర్యటనకు వెళ్లడంతో ఎమ్మెల్యే కిడారి మావోయిస్టుల తూటాలకు బలయ్యారు.

పోలీస్ స్టేషన్లకు నిప్పు

జంట హత్యలపై స్థానిక గిరిజనులు, మృతుల అనుచరులు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ మృతదేహాలను డుంబ్రిగూడ పోలీస్‌స్టేషన్ వద్దకు తరలించి ఆందోళన నిర్వహించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే మావోయిస్టుల దాడి జరిగిందంటూ డుంబ్రిగూడ, అరకు పోలీస్ స్టేషన్లపై దాడిచేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి, రెండు పోలీస్ స్టేషన్లకు నిప్పుపెట్టారు. ప్రాణాలను రక్షించుకునేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం ఏమీ లేదని ఏపీ హోంమంత్రి చిన్నరాజప్ప తెలిపారు.

అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు

అరకు ఘటనతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. పరిస్థితి అదుపులోనే ఉన్నా.. నిఘా పటిష్ఠం చేయాలని ఎస్పీలకు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. ప్రజాప్రతినిధులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బయటికి వెళ్లొద్దని, పర్యటనలకు వెళ్లాల్సి వస్తే పోలీసులకు ముందుస్తు సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది.

Related Stories: