లైంగిక వేధింపులు మామూలే!

సీపీఎం ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చిన కేరళ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ జొసెఫిన్ తిరువనంతపురం: లైంగిక వేధింపులు కొత్తేం కాదు.. మనమంతా మనుషులం.. తప్పులు జరుగుతుంటాయి అని కేరళ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ జోసెఫిన్ వివాదాస్పద వ్యాఖలు చేశారు. సీపీఎం ఎమ్మెల్యే పీకే శశి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అదే పార్టీ యువజనసంఘం డీవైఎఫ్‌ఐకి చెందిన మహిళా నేత ఇటీవల సీపీఎం అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పార్టీలో ఒక అంతర్గత విచారణ కూడా ప్రారంభమైంది. అయితే, ఈ అంశం వెలుగులోకి రావటంతో.. దీనిపై కేసు నమోదు చేయాలని జాతీయమహిళా కమిషన్ కేరళ పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో జోసెఫిన్ మీడియాతో మాట్లాడారు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సుమోటోగా కేసును నమోదు చేసుకోవడానికి మావద్ద ప్రాథమిక సమాచారం కూడా లేదు. అయినా, లైంగిక వేధింపులు కొత్తేం కాదు.. మనమంతా మనుషులం.. తప్పులు జరుగుతుంటాయి. ఆ పార్టీలో (సీపీఎంలో) ఉన్న ఇతరులు కూడా ఇటువంటి తప్పులకు పాల్పడి ఉంటారు. ఇలాంటి వివాదాలను పరిష్కరించుకునేందుకు ఆ పార్టీకి తనదంటూ కొన్ని సొంతవిధానాలు ఉంటాయి. గతంలోనూ ఆ పార్టీ ఇటువంటివాటిని పరిష్కరించింది అని పేర్కొన్నారు.

Related Stories: