సమస్యలు గుర్తించే కమిషన్ పెంచాం

-17,800మంది డీలర్లకు ప్రభుత్వం అండ -అన్నివర్గాల ఆనందమే సీఎం కేసీఆర్ లక్ష్యం -పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అన్నివర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రాష్ట్రంలోని 17,800 మంది రేషన్ డీలర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవంతో బతికేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నదని తెలిపారు. బుధవారం సచివాలయంలో రేషన్‌డీలర్లకు కమిషన్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పరిధిలోని రేషన్ డీలర్లకు కమిషన్ చెక్కులు పంపిణీచేశారు. అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ రేషన్ డీలర్ల సమస్యలను గుర్తించిన ప్రభుత్వం బియ్యం కమిషన్‌ను క్వింటాల్‌కు 20 పైసలు నుంచి 70 పైసలకు పెంచిందని చెప్పారు. తెలంగాణ వచ్చాక పౌరసరఫరాల వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, గతంలో రేషన్ పంపిణీలో ఉన్న అక్రమాలను అరికట్టామన్నారు. రేషన్ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.

2015 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రేషన్ డీలర్లకు కమిషన్ చెక్కులను అందజేస్తున్నామన్నారు. ఇందుకురూ.9,40,20,788 పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. రేషన్‌బియ్యం సరఫరాలో తూకం నష్టపోకుం డా.. రేషన్ షాపుల వద్దే తూకం వేసేలా ఏర్పాటు చేస్తామన్నారు. పౌరసరఫరాలశాఖ చేపట్టిన చర్యల్లో భాగంగా రూ.800 కోట్లు ఆదా అయ్యాయని చెప్పారు. రేషన్ డీలర్లు సహకరిస్తే మరో రూ.500 కోట్లు కూడా ఆదా చేయగలుగుతామని చెప్పారు. రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ మాట్లాడుతూ 35 నెలలకు సంబంధించి రేషన్ డీలర్ల కమిషన్ బకాయిని ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. దేశంలోనే తొలిసారి తెలంగాణలో ఆన్‌లైన్ విధానంలో రేషన్ బియ్య పంపిణీని ప్రారంభించామన్నారు. పెద్దపల్లి, సిరిసిల్ల, యాదాద్రి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఐరిష్ విధానాన్ని అమలుచేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సీఆర్వో బాలమహాదేవి, రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు నాయికంటి రాజు, మల్లేశం, కుమార్ తదితరులు పాల్గొన్నారు.