65 ఏండ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో..

నిజామాబాద్ : జిల్లాలోని కోటగిరి మండలం దేవునిగుట్ట తండాలో రూ. 1.51 కోట్ల ఖర్చుతో నిర్మించే 30 డబుల్ బెడ్ రూం ఇండ్లు, కొత్తపల్లి గ్రామంలో రూ. 1.26 కోట్ల ఖర్చుతో నిర్మించే 25 డబుల్ బెడ్ రూం ఇండ్లకు మంత్రి పోచారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా పేదవారి ఆత్మగౌరవం కాపాడేందుకు అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూం ఇంటిని కట్టించి ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5.04 లక్షలు, రూ. 1.25 లక్షల ఖర్చుతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యంతో పాటు మిషన్ భగీరథ ద్వారా వచ్చే మంచినీటి నల్లా కనెక్షన్ ఇస్తున్నామని పోచారం వివరించారు. ఒక్కో డబుల్ బెడ్ రూం ఇంటికి మొత్తం రూ.7 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. లబ్ధిదారులు ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించక్కరలేదన్నారు.

గతంలో దొంగలు దొంగలు కలిసి ఇండ్లు పంచుకున్నారని, వారే ఇప్పుడు దుర్బుద్ధితో మాట్లాడుతున్నారని మంత్రి పోచారం విమర్శించారు. 65 ఏండ్లలో జరగని అభివృద్ధి కేవలం ఈ నాలుగేండ్లో చేశామన్నారు. 500 జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతు బీమాతో భరోసా వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి సాహసం, ధైర్యంతో రాష్ట్రంలో కరెంటు కష్టాలు తీర్చారని కొనియాడారు.

Related Stories: