మహాకూటమితో జాగ్రత్త: మంత్రి పోచారం

కామారెడ్డి: మహాకూటమి పేరుతో మాయగాళ్లు వస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రజలకు సూచించారు. బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలంలోని దామరంచ, కిష్టాపూర్, చించెల్లి, బరంగెడ్గి, అన్నారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం ప్రసంగించారు. మహాకూటమి అంటూ పొత్తు గట్టి మరోమారు తెలంగాణ ప్రాంతంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సీఎం అభ్యర్థి ఎవరూ చెప్పలేని కూటమికి నాయకత్వమే లేదన్నారు. కేసీఆర్ దమ్మున్న నాయకుడని, ఆయనే సీఎం అని స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేసిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని, తెలంగాణలో మళ్లీ గందరగోళం సృష్టించే ప్రయత్నమే తప్ప, ప్రజలకు ఏ మాత్రం న్యాయం చేయలేరని అన్నారు. కారు గుర్తుకు ఓటేసీ తనను మరోసారి ఆశీర్వదించాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.

Related Stories: