కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యం: ల‌క్ష్మారెడ్డి

జడ్చర్ల: రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే సీఎంగా కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని, ఆయనతో బంగారు తెలంగాణ సాధ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా.ల‌క్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబ్‌పేట మండలం దేపల్లి, రంగంపల్లి గ్రామంలో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి కావాలంటే మళ్లీ టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. లేకుంటే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో దొడ్డిదారిన అధికారం చేపట్టి, సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు పన్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని, దొంగచాటుగా వస్తున్న కుట్రదారులను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి ఓటే సరైన మార్గమన్నారు. పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరించిందని, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత హర్షవర్ధన్‌రెడ్డి గ్రీన్ ట్రిబ్యూనల్‌లో కేసులు వేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత పాలమూరు-రంగారెడ్డి పనులు నిలిపివేయాలని కోరుతూ కేంద్ర జలవనరుల సంఘానాకి లేఖ రాశాడన్నారు. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారని తెలిపారు. అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్, టీడీపీలకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌ను ఆదరించాలన్నారు.

Related Stories: