కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో కేటీఆర్ సమావేశం

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వచ్చే బడ్జెట్‌లో ఎయిమ్స్‌కు నిధులు కేటాయించాలని, సిరిసిల్లలో మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటుకు ఆర్థికంగా మద్దతు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరినట్లు కేటీఆర్ చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలకు ఈ బడ్జెట్‌లో న్యాయం జరిగేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు. తమ ప్రతిపాదనలపై జైట్లీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. దేశ జీడీపీ కన్నా రాష్ట్ర జీడీపీ అధికంగా ఉన్నదని కేంద్రమంత్రి ప్రశంసించారని తెలిపారు. అన్ని విధాలా రాష్ర్టాన్ని ఆదుకుంటామన్నారు. దేశంలోనే అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని జైట్లీ అన్నారని తెలిపారు. గతంలో రాష్ట్రం నుంచి అందిన ప్రతిపాదనలను జైట్లీ గుర్తు చేశారని చెప్పారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణ ప్రజలు మంచి వార్త వింటారని అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. జైట్లీని కలిసిన వారిలో కేటీఆర్‌తో పాటు ఎంపీ వినోద్, ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ ఉన్నారు.

Related Stories: