వాళ్లు డబ్బా ఇండ్లు కట్టిస్తే.. మేము పక్కా ఇండ్లు కట్టిచ్చాం: కేటీఆర్

మహబూబ్‌నగర్: కాంగ్రెస్ హయాంలో ప్రజలకు డబ్బా ఇళ్లు కట్టించారని.. కానీ కేసీఆర్ ప్రభుత్వం మాత్రం.. ప్రజలకు రెండు పడకగదుల ఇళ్లు కట్టించి ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ జిల్లాలో పర్యటించిన మంత్రి.. ఈ సందర్భంగా దివిటిపల్లిలో 1024 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మంత్రి ల‌క్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన మంత్రి కేటీఆర్.. చరిత్రలో ఊహించని విధంగా సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల హృదయాల్లో ఉన్నారన్నారు. "సీఎం కేసీఆర్‌ను గద్దె దింపాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎందుకు దించాలి అని మేం అడుగుతున్నాం. ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినందుకు కేసీఆర్‌ను గద్దె దించాలా? రైతులకు పెట్టుబడి రాయితీ ఇస్తున్నందుకు గద్దె దించాలా? ఆడ బిడ్డల పెళ్లిళ్లు చేసినందుకు గద్దె దించాలా? మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు ఇస్తున్నందుకు కేసీఆర్‌ను గద్దె దించాలా? దగా పడిన పాలమూరుకు తాగు, సాగునీరు అందించినందుకు గద్దె దించాలా? టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటికీ రెండింతలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇంటింటికి వచ్చి గోరుముద్దలు తినిపిస్తామని కాంగ్రెస్ నేతలు నమ్మబలుకుతున్నారు. కాంగ్రెస్ పాలన తీరు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోతలు రైతన్నలకు తెలియనివి కావు.." అని మంత్రి తెలిపారు.

Related Stories: