అధైర్యపడొద్దు.. అన్ని విధాలుగా ఆదుకుంటాం: మంత్రి కేటీఆర్ హామీ

మహబూబ్ నగర్: రాజోళికి చెందిన విద్యాసాగర్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తన చివరి కోరికగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను చూడాలనుకున్న విషయాన్ని స్థానిక టీఆర్‌ఎస్ నాయకుల ద్వారా మంత్రి కేటీఆర్ తెలుసుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్‌లను బాధితుడి వద్దకు పంపారు. ఈ సందర్భంగా వారు రాజోళిలో బాధితుడిని కలిసి పరామర్శించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడించగా.. బాధితుడు సంతోషంతో కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సందర్భంగా ఫొన్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ విద్యాసాగర్ అధైర్యపడొద్దు, నిన్ను, నీకుటుంబాన్ని అన్ని విధాలుగా అదుకుంటాం.. నీకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే నిన్ను కలుస్తానని, ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోతున్నానని, అక్కడ ఉన్న మా శ్రేణులు నీకు అన్ని విధాలుగా సహకరిస్తారని తెలిపారు. దీనికి స్పందించిన విద్యాసాగర్ నేను ఎక్కడికి రాలేనని, మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందని, మీరు నాపై, నా ఆరోగ్యంపై చూపిన శ్రద్ధకు మీకు రుణపడి ఉంటానన్నారు. అంతకు ముందు జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్‌ఎస్ నాయకులు కృష్ణమోహన్ రెడ్డిలు విద్యాసాగర్ స్థితిగతులపై ఆరా తీశారు. హైదరాబాద్ దాకా ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి, అక్కడ నాణ్యమైన వైద్యం అందిస్తామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా దానికి బాధితుడు తన రెండు కిడ్నీలు పాడైపోయాయని, ఇంకా ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతున్నానని, అంత దూరం ప్రయాణం చేయలేనని, తన బాగోగులు తెలుసుకోవడానికి మంత్రి కేటీఆర్ కోరిక మేరకు మీరు వచ్చి నన్ను పరామర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బాధితుడికి రూ.25 వేలు ఆర్థిక సహాయాన్ని వారు అందించారు. శనివారం కూడా అలంపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి అబ్రహంను, ఆదివారం మిమ్మల్ని మంత్రి కేటీఆర్ నా కోసం పంపడం చూస్తే ఆయనది ఎంత గొప్ప హృదయమో అర్థమవుతుందని విద్యాసాగర్ అన్నారు.

Related Stories: