రైతు బంధువు ప్రభుత్వం కావాలా... రాబంధులు కావాలా

హైదరాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎల్ రమణలు ఇద్దరు గడ్డపోళ్లు ఒక్కటయ్యారు. కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడానికి ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. జగుస్సాకరమైన, నీచమైన ఆ రెండు పార్టీల కలయిక వల్ల ప్రజలకు ఒక సువర్ణావకాశం దొరికింది. 65 ఏళ్లు రైతులను రాబందుల్లా పీక్కుతిన్న వాళ్లు రావాలా....రైతు బంధువుగా మారిన ప్రభుత్వం రావాలో తేల్చుకునే సమయం వచ్చింది. ముదిగొండ, బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన కాంగ్రెస్, టీడీపీలు రెండు ఒక్కటైనాయి. దశాబ్దాలపాటు పాలించినా కరెంటు ఇవ్వకుండా రైతులను గోస పుచ్చుకున్న రెండు పార్టీలు ఒకవైపు... 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తూ రైతులకు నాయకత్వం వహిస్తున్న టీఆర్‌ఎస్ మరోవైపు ఉన్నాయి. కాంగ్రెస్, టీడీపీ పార్టీల దురాగతాలు ఒకటీ రెండు కాదు. ఆ రెండు పార్టీలను వాయించి కొట్టే అవకాశం ఒకేసారి తెలంగాణ ప్రజలకు దొరికింది. స్వియ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని జయశంకర్ సార్ అనేవారు. మరోసారి మనం కట్టుబానిసలుగా మారి ఢిల్లీ, అమరావతి వైపు చుద్దామా... టీఆర్‌ఎస్ పార్టీకి పట్టంగట్టి గల్లీ నాయకత్వం వైపు చూద్దామా అని అడిగారు. నా తెలంగాణ కోటి రతనాల వీణే కాదు... కోటి ఎకరాల మాగాణి. నిజామాబాద్ జిల్లాలోని రైతుల కలలు నెరవేర్చాలని ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకాన్ని ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది. కేవలం నాలుగేళ్లలోనే కాలంతో పోటీ పడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. గడ్డం పెంచుకున్న ప్రతీ ఒక్కరూ గబ్బర్ సింగ్‌లు కారు. ఎన్నికలు అర్థరాత్రి వచ్చినా తయార్ అన్నవారంతా ఎన్నికల కమిషన్ ముందు ఇప్పుడు అక్కరలేదంటున్నారని ఎద్దేవా చేశారు. సురేశ్ రెడ్డితో పాటు ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ బండారి లకా్ష్మరెడ్డి, కరీంనగర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి, ముఖ్యనేతలకు గులాబీ కండువా కప్పి సీఎం కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా తాజా మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Related Stories: