కోదండరామ్‌కు మొండి చెయ్యి ఇచ్చింది: కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో చొప్పదండి, వేములవాడ, వరంగల్‌కు చెందిన పలువురు నేతలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రైతుబంధు పథకం అన్నదాతలో భరోసా నింపింది. రైతు బీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్నాం. రైతుబంధు పథకానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఇచ్చింది. కాంగ్రెస్ నేతలు మాత్రం రైతుబంధును గుర్తించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌పార్టీ కోదండరామ్‌ను కరివేపాకులా వాడుకుంటోంది.

కాంగ్రెస్ తన గుర్తుకు తగినట్లే కోదండరామ్‌కు మొండి చెయ్యి ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ఎవరొచ్చి ఏం పగులకొడ్తరోనని గాంధీభవన్‌ను మూసి పెట్టుకున్నారు. గాంధీభవన్ చుట్టూ బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నరు. రూ. 3 కోట్లకు టికెట్లు అమ్ముకునేటోళ్లు రేపు రాష్ర్టాన్ని అమ్ముకోరని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ సీట్లు ఇచ్చారు. చంద్రబాబు నోట్లు పంపారు. ఓట్లు వేసిది మాత్రం తెలంగాణ ప్రజలన్న విషయం గుర్తించలేక పోయారని మండిపడ్డారు. పొరపాటును కూటమికి ఓటేస్తే తెలంగాణ వనరులు పరాయి వాళ్లకు వెళ్తాయి. కూటమి అభ్యర్థికి వేసే ఓటు అమరావతి, ఢిల్లీకి చేరుకుంటుంది. జీవోలు కూడా అమరావతి నుంచే వస్తయి. 60 ఏండ్ల మోసం నుంచి ఇప్పుడిప్పుడే తెలంగాణ కోలుకుంటుంది. ఓటును ఆలోచించి వేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో 40 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. వేములవాడకు గోదావరి జలాలు రాబోతున్నాయి. వేములవాడ దేవాలయం అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం వంద కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు.

Related Stories: