మహాకూటమి ఒక విఫల ప్రయోగం..

- ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జనగామ: మహాకూటమి ఒక విఫల ప్రయోగమని, ఆ కూటమి సీట్ల సర్దుబాటు చేసుకోలేక చేతులెత్తేసిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. 23న జనగామలో జరిగే కేసీఆర్ సభ ఏర్పాట్లను టీఆర్‌ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మిత్ర పక్షాలకు కేటాయించిన సీట్లలో కాంగ్రెస్ తన అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చి మోసం చేసిందని, కూటమిని అవమానించిందన్నారు. మహాకూటమిలోని నాలుగు పార్టీలు కలిసి కామన్ మినిమమ్ ప్రోగ్రాం ప్రకటించి, ఆ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించాయన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఎజెండాను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటిస్తే, తాజాగా టీడీపీ సైతం మ్యానిఫెస్టోను విడుదల చేసిందని, పేరుకు మహాకూటమి అంటూ ఇలా ఎవరికి వారు ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించుకొని ప్రజలను అయోమయానికి గురిచేయడంతోపాటు మోసం చేయడమేనని మండిపడ్డారు. జనగామ నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొన్నాల లక్ష్మయ్యది దయనీయమైన పరిస్థితి అని, 35 ఏళ్లు పనిచేసిన వ్యక్తిని, అందులో ఒక బీసీ నాయకుడిని కాంగ్రెస్ అవమానించడంతో దాన్ని భరించలేక ఆయన ఏడ్చే పరిస్థితి వచ్చిందని కడియం శ్రీహరి అన్నారు. అది కాంగ్రెస్ పార్టీ నైజమని, పొన్నాలనే అవమాన పరిచిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేయదనే నమ్మకం లేదన్నారు. టీఆర్‌ఎస్, కేసీఆర్‌పై ప్రజల్లో బ్రహ్మాండమైన విశ్వాసం, నమ్మకం ఉందని, జిల్లాలో జరిగిన పాలకుర్తి సభ అందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. ఇది తమపై ప్రజలకున్న విశ్వాసానికి, విజయానికి సంకేతంగా భావిస్తున్నామని అన్నారు. రెండోసారి జనగామ నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రెండోసారి విజయకేతనం ఎగురవేయబోతున్నారని కడియం ధీమా వ్యక్తం చేశారు.

Related Stories: