నాగలి పట్టిన మంత్రి జూపల్లి

పాన్‌గల్: పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొద్దిసేపు రైతుగా మారారు. ఓ రైతు పొలంలో విత్తనాలు వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆదివారం ఆయన వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం శాగాపూర్, మాధవరావుపల్లి, రేమొద్దుల, కిష్టాపూర్ తండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా శాగాపూర్‌లోని ఓ రైతు పొలంలో నాగలి ద్వారా వేరుశనగ విత్తనాలు విత్తారు. ఆయా గ్రామాల్లో మంత్రి రైతులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో బీడు భూముల్లో జలసిరులు సంతరించుకున్నాయన్నారు. నాలుగున్నరేండ్లలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై వచ్చే నెల 3,4,5,6వ తేదీల్లో కొల్లాపూర్‌లో సంబురాలు నిర్వహిస్తున్నామని, అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో వ్యవసాయం రంగం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం ఆయన టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ శ్రీశైలం డ్యాంలో నీరున్నంత వరకు సాగునీటికి ఢోకా లేదన్నారు. ఇకనుంచి రెండు పంటలకు సాగునీరు అందుతుందని మంత్రి జూపల్లి తెలిపారు.