16 మంది సీఎంలు పాలించినా అభివృద్ధి శూన్యం

- మహాకూటమికి ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లే.. - బెక్కెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి జూపల్లి వనపర్తి: సమైక్య రాష్ర్టాన్ని 16 మంది ముఖ్యమంత్రులు పాలించినప్పటికీ తెలంగాణను ఏ ఒక్కరూ రవ్వంత కూడా అభివృద్ధి చేయలేదని, ఇక్కడి వనరులను దోచుకెళ్లి సీమాంధ్రను అభివృద్ధి చేశారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. చిన్నంబావి మండలంలోని బెక్కెం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని, దీనిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకుల కళ్లు మండి పొత్తు పెట్టుకున్నారన్నారు. తెలంగాణకు అప్పుడు అడ్డు తగిలిన చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకొని మహాకూటమి పేరులో వచ్చి ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు చేయొద్దని ఢిల్లీ, కేంద్రానికి లేఖలు రాసి అడుగడుగునా అడ్డు తగిలిన చంద్రబాబుతో పొత్తు ఏంటన్నారు. ఎన్ని మాయకూటమిలు ఏర్పడినా కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను ఎదురుకునే దమ్ము లేదన్నారు. మహాకూటమిని నమ్మి అధికారమిస్తే హైదరాబాద్ నుంచి కాకుండా పరిపాలన అంతా అమరావతి నుంచి చంద్రబాబు నడిపిస్తాడని, ఆంధ్రా పాలన కావాలో అబివృద్ధి చేస్తున్న కేసీఆర్ పాలన కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం అనేక ప్రాజెక్ట్‌లు నిర్మించి ప్రారంభించుకున్నామని, వాటి ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నామన్నారు. రైతుల కోసం నిరంతరంగా ఉచిత విద్యుత్, రైతుబంధు, ఎరువులు, విత్తనాల సరఫరా, ధాన్యానికి మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం మరింత అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Related Stories: