యూజీసీ నియామకాల్లో రిజర్వేషన్లు ఉంటాయి: జవదేకర్

న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఇటీవల తన తాజా ఆదేశాల్లో రిజర్వేషన్ అంశాన్ని పక్కనపెట్టింది. దీనిపై ఇవాళ రాజ్యసభలో సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించారు. రిజర్వేషన్లను పట్టించుకోకుండా ఎలా ఉద్యోగులను నియమిస్తారని ఎంపీ రాంగోపాల్ యాదవ్ ప్రశ్నించారు. యూజీసీ ఇచ్చిన జీవో.. రిజర్వేషన్ నియమావళికి వ్యతిరేకంగా ఉందన్నారు. తాజా జీవో వల్ల ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కూడా దీనిపై స్పందించారు. యూజీసీ తాజా ఆదేశాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై హెచ్‌ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమాధానం ఇచ్చారు. సభ్యుల ఆందోళనలను ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. కోర్టు తీర్పు ఆధారంగా యూజీసీ తాజా జీవోను జారీ చేసిందని మంత్రి తెలిపారు. అయితే ఈ అంశంపై ప్రభుత్వం రెండు స్పెషల్ లీవ్ పిటీషన్లు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా ఆదేశాల ప్రకారం కొన్ని వర్సిటీలు ఖాళీలను పూరిస్తున్నాయని, అయితే ఇంటర్వ్యూలను నిలిపివేయాలని ఆ వర్సిటీలకు ఆదేశించామని, రిజర్వేషన్లు ఉంటాయని మంత్రి సభలో స్పష్టం చేశారు.
× RELATED తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం