టీఆర్‌ఎస్ అంటే కాంగ్రెస్‌కు వణుకు : జగదీశ్ రెడ్డి

సూర్యాపేట : టీఆర్‌ఎస్ పార్టీ పేరు వినగానే కాంగ్రెస్ పార్టీకి వణుకు పుడుతుందని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. నిన్న ఖమ్మం జిల్లాలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో ప్రారంభమైన ట్రాక్టర్ ర్యాలీ ఇవాళ మధ్యాహ్నం సూర్యాపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ ట్రాక్టర్ ర్యాలీకి జగదీశ్‌రెడ్డి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు. ప్రగతి నివేదన సభ తర్వాత కాంగ్రెస్ నాయకులు పెట్టుకునే ప్రతి సభ.. ఆవేదన సభలే అని మంత్రి ఎద్దెవా చేశారు. ప్రగతి నివేదన సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో.. అది చూడలేక.. కాంగ్రెస్ నాయకులు సభపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమ్మక్క - సారలమ్మ, లింగమంతుల జాతరకు తరలినట్లుగా ప్రగతి నివేదనకు జనం తరలుతున్నారని తెలిపారు. రైతే రాజు అన్న కాంగ్రెస్ నాయకులు.. రైతు వెన్నెముక విరిచారు. కానీ సీఎం కేసీఆర్ రైతును రాజుగా చేశాడని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రసంగం కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని మంత్రి చెప్పారు.
× RELATED నేను తాతనని ఒప్పకున్నాడు..