గెలుపు ఖాయం.. మెజార్టీయే లక్ష్యం

-అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జనంలోకి వెళ్లండి -గత ప్రభుత్వాల సంక్షేమంతో బేరీజు వేసి వివరించండి -ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టండి -ప్రజల స్పందనపై ఎంపీలు నివేదికలు అందించాలి -ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం
సంగారెడ్డి, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం ఖాయమైపోయిందని, భారీ మెజార్టీయే లక్ష్యంగా అభ్యర్థులు పనిచేయాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితోపాటు ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్ అభ్యర్థులు, జెడ్పీ చైర్‌పర్సన్‌తో మంత్రి ఆదివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎన్నికల ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అధికారంలో వచ్చాక చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి వివరించాలని సూచించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల ప్రజాప్రతినిధులు, అధికారులు ఇక్కడకు వచ్చి పరిశీలించి.. అద్భుతమైన పథకాలు అమలుచేస్తున్నారని సీఎం కేసీఆర్‌ను, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇవే అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు పోటీపడాలని, ఇదే సందర్భంలో తప్పుడు ప్రచారాలతో జనంలోకి వస్తున్న ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాలవారీగా ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లానుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడం మన అదృష్టమని, ప్రస్తుతం 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ప్రాతినిథ్యం వహించిందని రాబోయే రోజుల్లో 10 నియోజకవర్గాలు మనవే ఉండాలని, ఇందుకోసం అభ్యర్థులు కష్టపడి పనిచేయాలని సూచించారు.

ప్రజలేం కోరుకుంటున్నారో నివేదికలు ఇవ్వండి

ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజల స్పందనపై ప్రత్యేకంగా నివేదికలు రూపొందించి అందించాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. మెదక్, జహీరాబాద్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌కు ప్రజల్లో మంచి గౌరవం ఉన్నదని, ప్రజలు ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారో గ్రామస్థాయిలో తెలుసుకోవాలని వారికి సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రచార బాధ్యత తనపై ఉన్నదని, జిల్లా సత్తా ఏమిటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్, తాజా మాజీ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, భూపాల్‌రెడ్డి, రామలింగారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.