తెలంగాణ అవసరాలను తీర్చండి : హరీష్‌రావు

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నదుల అనుసంధానంపై ఇవాళ ఢిల్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రం తరపున నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పామని తెలిపారు. తెలంగాణ అవసరాలు తీర్చిన తర్వాత మిగిలిన నీటిని తీసుకోవడంలో తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశామని పేర్కొన్నారు. తెలంగాణకు కేటాయించిన 954 టీఎంసీల నిరక జలాలు పోగా మిగిలిని నీటిని తీసుకోండని చెప్పారు. తమ ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వకుండా నదుల అనుసంధానానికి డీపీఆర్ తయారు చేయడాన్ని గట్టిగా వ్యతిరేకించినట్లు హరీష్‌రావు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు జరిగాక నదుల అనుసంధానంపై ఆలోచించాలని సమావేశంలో స్పష్టం చేసినట్లు మంత్రి తెలిపారు. ఇదే అంశాన్ని రాతపూర్వకంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి అందించామని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు త్వరగా ఇవ్వాలని కోరాం. జాతీయ హోదా ఏ ప్రాజెక్టులకు ఇవ్వడం లేదని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి చెప్పారు. కానీ 60:40 నిష్పత్తిలో గ్రాంట్లు ఇస్తామని చెప్పిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. మహారాష్ట్రలో కొన్ని ప్రాజెక్టులకు గ్రాంట్లు ఇచ్చినట్లుగానే, తెలంగాణకు గ్రాంట్లు ఇవ్వాలని కోరామని మంత్రి తెలిపారు.

Related Stories: