చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి? : హరీశ్ రావు

సిద్ధిపేట : మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటో అర్థం కావడం లేదని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. నంగునూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రాత్రింబవళ్లు కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టును కడుతుంటే పక్కన ఉన్న బాబుకు కళ్లు మండుతున్నాయని ధ్వజమెత్తారు. కాళేశ్వరానికి అన్ని అనుమతులు రావడంతో జీర్ణించుకోని చంద్రబాబు.. ఎలాగైనా ఆ ప్రాజెక్టును ఆపాలని ఢిల్లీకి ఫిర్యాదు చేసిండని మంత్రి తెలిపారు.

గోదావరి నీళ్లల్లో 954 టీఎంసీలు మన వాటా

గోదావరి నీళ్లల్లో 954 టీఎంసీలు మన వాటా.. మన హక్కు అని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసమని ఆయన చెప్పారు. కలిసి ఉన్నంత కాలం మన నీళ్లు దక్కడం లేదనే వేరు పడ్డామని హరీశ్‌రావు తెలిపారు. చంద్రబాబు అప్పుడేమో తెలంగాణ రాకుండా అడ్డుపడ్డాడు. ఇప్పుడేమో ప్రాజెక్టులు కడుతుంటే ఓర్వలేకపోతున్నారని నిప్పులు చెరిగారు. ఎవరూ అడ్డుపడినా తెలంగాణలో ప్రాజెక్టులు కడుతాం.. రైతులకు నీళ్లు ఇస్తామని మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు.
× RELATED యువకుడి దారుణహత్య.. ప్రేమవ్యవహారం బయటపెట్టడమే కారణమా?