విస్తరిస్తున్న.. "ప్రకృతి'వైద్యం

అమీర్‌పేట్ : ఎటువంటి దీర్ఘకాలిక రోగాలనైనా.. ప్రకృతి చికిత్స ద్వారా నయం చేయవచ్చనే నమ్మకం ప్రజల్లో బలపడుతున్నది. దీంతో వైద్యం కోసం బల్కంపేటలోని గాంధీ ప్రకృతి చికిత్సాలయానికి వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. సుమారు 70 ఏండ్ల క్రితం 10 ఎకరాల స్థలంలో విస్తరించిన ఈ దవాఖానకు నగర నలుమూలల నుండే కాక, దేశంలోని ఇతర ప్రాంతాల నుండి చికిత్స పొందేందుకు వస్తున్నారు. రోగుల తాకిడిని గుర్తించిన ప్రభుత్వం ఇటీవల రూ.1.20 కోట్లతో కాటేజ్ ట్రీట్‌మెంట్ సెక్షన్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రకృతి వైద్యాన్ని మరింత మెరుగైన రీతిలో అందించేందుకు చికిత్సాలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఏకకాలంలో 20 మందికి చికిత్సలు

బల్కంపేట ప్రకృతి చికిత్సాలయ ఆవరణలో రూ.1. 20 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కాటేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వైద్యానికి వచ్చే వారికి చక్కటి సేవలందించనుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వనరులతో టబ్‌బాత్, మసాజ్, స్టీమ్ బాత్, మడ్‌బాత్, వర్ల్‌పూల్‌బాత్ వంటి వైద్య చికిత్సలను ఏకకాలంలో 20 మందికి చేయవచ్చు. 184 పడకల సామర్ధ్యం ఉన్న ఈ దవాఖానను మున్ముందు మరింత అభివృద్ధి చేసే స్థాయిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రోగుల తాకిడి గణనీయంగా పెరిగింది...

గాంధీ ప్రకృతి చికిత్సాలయంలో అందుతున్న వైద్యం పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతున్నది. చికిత్సలు పొందేందుకు రోగులు అధికంగా వస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం మెరుగైన వైద్య సౌకర్యాలు అందిస్తున్నది. ఊబకాయం, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలోకి తెచ్చుకోవడంతో పాటు నరాల జబ్బులు, పక్షవాతం వంటి సమస్యలకు ఇక్కడ చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. నూతనంగా నిర్మించిన కాటేజ్ ట్రీట్‌మెంట్ సెక్షన్ భవంతితో ఏకకాలంలో పదుల సంఖ్యలో వైద్య సేవలందించే వీలు కలిగింది. మరో 16 మంది ఉద్యోగులను ఔట్‌సోర్సింగ్ విధానం ద్వారా నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా అత్యాధునిక యంత్ర పరికరాలను కూడా ఈ భవంతిలో ఏర్పాటు చేసేలా చూడాలని కోరుతూ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. త్వరలోనే ఈ యంత్ర పరికరాలు అందుబాటులోకి వస్తే ఇక్కడ చికిత్సలు మరింత పెరుగుతాయి. ఎన్.భాను కిరణ్, సూపరింటెండెంట్, ప్రకృతి చికిత్సాలయం.

Related Stories: