ఆ ఘడియలు రాలేదేమో!

నాకు వివాహం జరిగిందని కొన్ని సార్లు, రహస్యంగా ఓ పారిశ్రామిక వేత్తతో నిశ్చితార్థం జరిగిందని కొన్ని సార్లు కథనాలు వినిపించాయి. అవి విని నవ్వుకున్నాను. ప్రస్తుతం నాకు పెళ్లి వయసు వచ్చేసింది. అయితే నాకు తగ్గ వరుడు మాత్రం ఇంత వరకు తారసపడలేదు అంటోంది అనుష్క. అరుంధతిలో జేజమ్మగా, రుద్రమదేవిలో రాణి రుద్రమగా, ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాహుబలిలో దేవసేనగా ఆకట్టుకున్న అనుష్క వివాహాం గురించి ఇటీవల వరుసగా వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై ఇటీవల ఓ తమిళ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. పెళ్లి మనం అనుకున్నప్పుడు జరగదు. ఆ ఘడియలు రావాలి. అప్పుడే జరుగుతుంది. నాకింకా ఆ ఘడియలు రాలేదేమో. ప్రస్తుతం నా దృష్టి సినిమాలపై వుంది. ప్రస్తుతం ఎక్కువగా కథానాయిక ప్రాధాన్య చిత్రాలనే ఎంచుకుంటున్నాను. ఒక నటిగా అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాల్లో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సైజ్‌జీరో వంటి వినూత్నమైన చిత్రంలో నటించినందుకు గర్వంగా వుంది. ఓం నమో వేంకటేశాయలో కొత్తగా కనిపిస్తా అని తెలిపిందట అనుష్క. ఆమె ప్రస్తుతం బాహుబలి-2, భాగమతి, సింగం-3 చిత్రాల్లో నటిస్తున్నది.