అవసరానికి తగ్గ ఆయుధాలేవీ?..

bsf పొరుగుదేశం పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. మరోవైపు చైనాతో సరిహద్దు విషయంలోనూ దూరదృష్టితో వ్యవహరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. అవసరానికి తగిన ఆయుధ సంపత్తి లేకపోవడం భారత సైనిక బలగాలకు ఇబ్బందికరంగా తయారయింది. ఆయుధాల కొనుగోళ్లలో అవినీతి, అనుమానాలు, జాప్యం.. ఆందోళనకర పరిస్థితులకు కారణమవుతున్నది. ఎం-777 అల్ట్రా లైట్ హోవిట్జర్ల కొనుగోలుపై ఆమోదం తెలిపేందుకు అమెరికా ఇచ్చిన గడువు ముగిసిపోవడం తాజా పరిణామం. న్యూఢిల్లీ, నవంబర్ 6: భారత సైన్యం ఆధునీకరణ ప్రక్రియలో అడుగులు ముందుకు పడటం లేదు. ఎప్పటికప్పుడు అవసరాలకు తగినట్లు ఆయుధాలను సమకూర్చుకోవడంలో ఎనలేని జాప్యం చోటుచేసుకుంటున్నది. అవినీతి ఆరోపణలు, సాంకేతిక ప్రమాణాల్లో లోపాలు కారణంగా డోలాయమాన పరిస్థితి కొనసాగుతున్నది. అమెరికా నుంచి ఎం-777 అల్ట్రా లైట్ హోవిట్జర్లను కొనాలని భావించినా, అందుకు సంబంధించిన ఆమోదపత్రంపై గడువు దాటేవరకు స్పందించలేకపోవడం తాజాగా వెలుగులోకొచ్చింది. 73.7 కోట్ల డాలర్లతో 145 హోవిట్జర్లను కొనుగోలు చేయాలని ఇదివరలో ప్రతిపాదించగా, ఆ మేరకు అమెరికా స్పందించింది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ (ఎల్వోఏ)ను భారత్‌కు పంపించింది. శనివారంతో ఆ ప్రతిపాదన పత్రం గడువు ముగిసిపోయింది. రెండు ప్రభుత్వాల మధ్య కుదుర్చుకునే ఆ ఒప్పందం ఎల్వోఏ నవంబర్ 5 వరకే చెల్లుబాటులో ఉండింది అని రక్షణ మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. దీనిపై ఏడేండ్లుగా చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా గత పదేండ్లలో భారత్‌కు 1400 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను సరఫరా చేసే ఒప్పందాలను కుదుర్చుకుంది. 11.8 లక్షల సైన్యానికి 1980లలో జరిగిన బోఫోర్స్ స్కాం తర్వాత 155 ఎంఎం ఆర్టిలరీ గన్లను సమకూర్చనేలేదు. చైనాతో 4057 కిలోమీటర్ల పొడవున ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్యేసీ) వెంట సత్వర చర్యలు చేపట్టడానికి అలాంటివి అవసరమేనని సైన్యం భావిస్తున్నది. హోవిట్జర్ ఒప్పందం మాత్రమే కాకుండా దాదాపు 120 చిన్నా పెద్దా ఆధునీకరణ ప్రాజెక్టులు దీర్ఘకాలంగా పెండింగులో పడిపోయాయి.
× RELATED గజగజలాడించింది