ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

కొడిమ్యాల: తన బావ పెండ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి లోనైన ఐటీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూలో శనివారం చోటుచేసుకుంది. ఎస్పీ అనంతశర్మ కథనం ప్రకా రం.. ఖమ్మం జిల్లా వైరా మండలం రిబ్బవరం గ్రామానికి చెందిన బండారి శ్రీలక్ష్మి(19) నాచుపల్లి జేఎన్టీయూలో ఐటీ విభాగం రెండో సంవత్సరం చదువుతున్నది. వరుసకు మేనబావ అయిన హరీశ్‌తో మూడు నెలల క్రితం శ్రీలక్ష్మికి పెద్దలు వివాహం నిశ్చయించారు. ఇదే కళాశాలలో గతేడాది ఐటీ ఫైనలియర్ పూర్తిచేసిన హరీశ్, ఇదే కళాశాలలో చదివే వెంకటేశ్వరమ్మను ప్రేమించాడు. వెంకటేశ్వరమ్మ శుక్రవారం సాయంత్రం హరీశ్ సాయంతో శ్రీలక్ష్మికి ఫోన్ చేసింది. మీ బావ నేను ప్రేమించుకుంటున్నాం.. నువ్వు వేరొకరిని పెండ్లి చేసుకో అని చెప్పడంతో కలత చెందిన ఆమె తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం తెలిపింది. హరీశ్‌కు ఇష్టం లేకపోతే వేరొకరితో పెండ్లి జరిపిస్తామని కుటుంబ సభ్యులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. హరీశ్ తనతో వివాహాన్ని కాదనడంతో మనస్తాపానికి లోనైన శ్రీలక్ష్మి శనివారం మధ్యాహ్నం ప్రత్యేక తరగతులకు వెళ్లకుండా తన గదిలోనే ఉండిపోయింది.అందరు వెళ్లిన తరువాత సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇందుకు బాధ్యులుగా భావిస్తున్న హరీశ్, వెంకటేశ్వరమ్మలపై కేసు నమోదు చేశారు. .