నగరానికి జలమాల

-ఔటర్ రింగ్‌రోడ్ చుట్టూ భారీ రింగ్ మెయిన్ పైప్‌లైన్ -4765 కోట్లతో జలమండలి భారీ ప్రణాళిక -నగరానికి గోదావరి, కృష్ణా జలాల సరఫరా వ్యవస్థల అనుసంధానం -హైదరాబాద్‌లో ఏ మూల నీటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం -ప్రాజెక్టు పూర్తయితే ఏ నగరానికీ లేని ప్రత్యేక నీటివ్యవస్థ సాకారం -ప్రభుత్వ పరిశీలనలో డీపీఆర్.. ఆ తర్వాత అమలులోకి
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తులో మంచినీటి సమస్య రాకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. దాదాపు కోటి జనాభా ఉన్న నగరానికి తాగునీటి కొరత రాకుండా ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరో బృహత్తర సంకల్పానికి సిద్ధమవుతున్నది. రూ.4725 కోట్లతో 1628 చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు నీటికొరత రాకుండా నివారించేందుకు ఔటర్ రింగురోడ్డు చుట్టూ జలమాలను నిర్మించనున్నది. భవిష్యత్తులో తలెత్తే నీటి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని మొత్తంగా 1,628 చదరపు కిలోమీటర్ల పరిధిలో (ఇందులో కోర్‌సిటీ 169.30 చ.కి.మీ. కాగా, శివారు ప్రాంతాలు 518.90 చ.కి.మీ., ఓఆర్‌ఆర్ గ్రామాల పరిధి 939.80 చ.కి.మీ.) ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఔటర్ రింగురోడ్డు చుట్టూ నిర్మించే రింగ్ మెయిన్ ప్రాజెక్టు ద్వారా ఎటువైపు నుంచైనా నీటిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో నగరంలో ఏ మూలన నీటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి వీలు ఏర్పడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు జలమండలి ప్రస్తుతం రోజూ 448 మిలియన్ గ్యాలన్ల నీటిని అందిస్తున్నది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా, గోదావరి నది వనరుల నుంచి నగరానికి రక్షిత జలాలను తరలిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నీటి తరలింపు ప్రక్రియ బ్రేక్ డౌన్ అయితే.. పరిస్థితి అంతా గందరగోళమే. అలాంటి ప్రత్యేక పరిస్థితిని ఎదురుకాకముందే నివారించేందుకు ప్రభుత్వం బృహత్తర పథకాన్ని తలపెట్టింది. రాజధాని మణిహారమైన ఔటర్ రింగు రోడ్డు వెంబడి 3000 ఎంఎం డయా పైపులైన్ నిర్మాణ పనులను చేపట్టేందుకు జలమండలి ప్రణాళిక సిద్ధంచేసింది. టాటా కన్సల్టెన్సీ ద్వారా డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) రూపొందించారు. 158 కిలోమీటర్ల మొత్తంలో భారీ పైపులైన్, 12 చోట్ల రిజర్వాయర్ల నిర్మాణపనులకు రూ.4765 కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ డీపీఆర్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. 169.30 చదరపు కిలోమీటర్ల మేర ఉన్న సంస్థ సేవల పరిధిని 1628 చదరపు కిలోమీటర్ల మేరకు పెంచిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే గ్రేటర్‌లో విలీనమైన 12 మున్సిపాలిటీల్లో రూ.1900కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను పూర్తిచేసి ప్రజల దాహార్తిని తీర్చారు. ఈ క్రమంలోనే ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న 191 గ్రామాలకు అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద రూ.756కోట్లతో ప్రాజెక్టును చేపట్టి సమృద్ధిగా నీటిని సరఫరా చేస్తున్నారు. గోదావరి ప్రాజెక్టులోని కీలకమైన ఘన్‌పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పటాన్‌చెరు రిజర్వాయర్ వరకు 1800 ఎంఎం డయాతో 44 కిలోమీటర్ల మేర పైపులైన్ పనుల్లో రైల్వే క్రాసింగ్ మినహా 40 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఇదే క్రమంలో నగర చరిత్రలో ఔటర్ రింగ్ మెయిన్ ప్రాజెక్టు అమలుకు రంగం సిద్ధంకావడం గమనార్హం. దీంతో నగరంలో ఏ మూలన నీటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి వీలు ఏర్పడుతుంది. ఉదాహరణకు కృష్ణా నీటిని మంజీరా జలాలపై ఆధారపడిన ప్రాంతాలకు మళ్లించాలంటే పాతనగరం నుంచి జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్ వరకు చేరుకుంటున్న జలాలను సంజీవరెడ్డినగర్ (డివిజన్ 6) మీదుగా పటాన్‌చెరు వైపు తరలించుకునే వీలు ఉంటుంది. కృష్ణా, గోదావరి జలాల మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి నగరం అంతర్గత వ్యవస్థలకు గ్రావిటీ ద్వారా నీటిని తరలించుకునే అవకాశం ఉంది. ఏ రిజర్వాయర్లలో వర్షాభావ పరిస్థితులు వచ్చినా, నీటి తరలింపులో బ్రేక్‌డౌన్ (అంతరాయం) ఏర్పడినా నీటి కొరత ఉండదని అధికారులు చెప్తున్నారు. కేశవాపురం, దేవులమ్మ నాగారంలో నిర్మించతలపెట్టిన భారీ రిజర్వాయర్లను ఔటర్ రింగు మెయిన్ ప్రాజెక్టుకు అనుసంధానం చేసేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలో ఏ నగరానికీ ఇప్పటివరకు లేని ప్రత్యేక నీటి వ్యవస్థ సాకారం కానుంది.

పైపులైన్ విస్తరణ పనుల్లో కీలక అంశాలు

3000 ఎంఎం డయా భారీ పైపులైన్ విస్తరణ పనుల్లో చాలా అవాంతరాలను అధిగమించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల అనుమతుల ద్వారా పనులను చేపట్టాల్సి ఉంటుంది. జంక్షన్ల వద్ద పనులు, రేడియల్ మెయిన్స్, రైల్వే క్రాసింగ్స్, నేషనల్ హైవే, స్టేట్ హైవే క్రాసింగ్ వద్ద పనులకు అనుమతులు, రోటరీ క్రాసింగ్, టన్నెలింగ్ పనులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 158 కిలోమీటర్ల ఔటర్‌లో ముత్తంగి, కండ్లకోయ, శామీర్‌పేట, అన్నోజిగూడ, పెద్ద అంబర్‌పేట, బొంగులూరు, ఆదిబట్ల, తుక్కుగూడ, ఎయిర్‌పోర్టు, కిస్మత్‌పుర, కోకాపేట జంక్షన్ మీదుగా పైపులైన్ అలైన్‌మెంట్ చేశారు.

నీటి కొరతకు శాశ్వత పరిష్కారంగా ప్రాజెక్టులు

హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు కీలకమైన కృష్ణా, గోదావరి సరఫరా వ్యవస్థల అనుసంధానం ద్వారా నీటి కొరత అసలే ఉండదు. నగరంలో ఏ మూలన నీటి సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి వీలు ఏర్పడుతుంది. నిరంతరం ప్రజలకు సమృద్ధిగా నీరందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కేశవాపురం భారీ రిజర్వాయర్, రింగు మెయిన్ పైపులైన్ పనులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాం. ఔటర్ రింగు మెయిన్ పైపులైన్ ప్రాజెక్టు డీపీఆర్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. జలమండలి ప్రాజెక్టులకు ఏడీబీ బ్యాంకు రుణం అందించేందుకు ముందుకువస్తున్నది. - ఎం దానకిశోర్, జలమండలి ఎండీ