నేనెప్పుడు తప్పు చేస్తానా అని మీడియా ఎదురుచూస్తున్నది!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మీడియాపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాను ఎప్పుడు తప్పు చేస్తానా అని మీడియా కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ చూస్తున్నదని ట్రంప్ అన్నారు. సీఎన్‌ఎన్ చానెల్‌కు చెందిన ఓ రిపోర్టర్‌ను వైట్‌హౌజ్‌లోకి రాకుండా నిషేధం విధించిన మరుసటి రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ కెమెరాలన్నింటినీ చూడండి. నేనెక్కడికి వెళ్లినా ఆ కెమెరాలు ఫాలో అవుతూనే ఉంటాయి. ఒబామాకు ఇలా ఎప్పుడూ జరగలేదు. బుష్‌కు ఎప్పుడూ జరగలేదు అని ఐయోవాలో తన మద్దతుదారుల సమావేశానికి వచ్చిన కెమెరా జర్నలిస్టులను చూపిస్తూ ట్రంప్ అన్నారు. నేనెప్పుడు తప్పు చేస్తానా అనుకుంటూ వాళ్లు నన్ను ఫాలో అవుతూనే ఉన్నారు అని ట్రంప్ మీడియాపై మండిపడ్డారు.

సీఎన్‌ఎన్ జర్నలిస్ట్‌ను వైట్‌హౌజ్‌లోకి రాకుండా నిషేధం విధించడంపై మిగతా జర్నలిస్టులు నిరసన తెలిపారు. అయినా ట్రంప్ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. తాను మాట్లాడిన ప్రతి మాటను మీడియా విశ్లేషిస్తుందని ట్రంప్ అన్నారు. గతంలో ఏ ప్రెసిడెంట్‌ను మీడియా ఇంతగా ఫాలో అవలేదని ఆయన స్పష్టంచేశారు. అందుకే తాను చేస్తున్న మంచి పనులను అందరికీ చెప్పాలని మద్దతుదారులను ట్రంప్ కోరారు.

Related Stories: