ప్రెస్‌క్లబ్‌లో దుండగుల దాడి

ఖైరతాబాద్, మే 21 : హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ రణక్షేత్రంగా మారింది. గుర్తుతెలియని దుండగులు ప్రెస్‌క్లబ్‌లో ప్రవేశించి మీడియా సమావేశం నిర్వహిస్తున్న దళిత నాయకులపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా అడ్డుకునేందుకు యత్నించిన మీడియా ప్రతినిధులపై దాడులకు పాల్పడ్డారు. పలు చానళ్లకు చెందిన లోగోలను ధ్వంసం చేశారు. దళిత నేతలను వెంటాడుతూ....దుర్భాషలాడుతూ తీవ్రంగా కొట్టారు. విలేకరులు వెంటనే తేరుకొని వారిని నిలువరించి పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. సుమారు అర్ధగంట సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసులు అక్కడికి చేరుకొని దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేశారు. సమావేశం జరుగుతుండగానే... రాష్ట్రంలోని పలు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో స్వేరోస్ సంస్థ ఆగడాలపై వివరించేందుకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ప్రారంభమైన పది నిమిషాల్లో గుర్తు తెలియని దుండగులు సుమారు పదిహేను మంది మీడియా ప్రతినిధులను పక్కకు తోసేసుకుంటూ సమావేశం గదిలోకి ప్రవేశించి డయాస్ మీద కూర్చొని ఉన్న సమితి అధ్యక్షుడు కర్నె శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి పాలడుగు అనిల్ కుమార్‌లపై విచక్షణ రహితంగా దాడి చేశారు. కెమెరా స్టాండ్లు, లోగోలను విరగ్గొట్టి భయోత్పాతాన్ని సృష్టించారు. ప్రాణభయంతో పరుగులు తీసిన కర్నె శ్రీశైలంను వెంటాడుతూ తీవ్రంగా కొట్టి కాళ్లతో తొక్కారు. వెంటనే తేరుకున్న మీడియా ప్రతినిధులు, విలేకరులు వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా, పరుషపదజాలంతో దూషిస్తూ వారిపై కూడా దాడులు చేశారు. మీ అంతు చూస్తామంటూ బెదిరించారు. పరిస్థితి గమనించిన ప్రెస్‌క్లబ్ సెక్యూరిటీ సిబ్బంది గేట్లను మూసివేశారు. ఒక్కసారిగా విలేకరులందరూ అక్కడికి చేరుకోగానే అందులో కొందరు ప్రెస్‌క్లబ్ గోడలు దూకి పరుగులు తీశారు. దాడులకు పాల్పడిన కొందరిని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పంజాగుట్ట సీఐ మోహన్ కుమర్, ఎస్సై శ్రీనివాసులు తమ బృందంతో అక్కడికి చేరుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా స్కెచ్‌తోనే దాడి..కారులో దుడ్డు కర్రలు.. దుండగులు పక్కా స్కెచ్‌తోనే దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ముందుగా పదిహేను మంది వరకు ప్రెస్‌క్లబ్‌లో దాడులకు పాల్పడగా, అందులో ఓ వ్యక్తి ఫోన్ చేయగానే మరికొందరు కార్లలో అక్కడికి చేరుకున్నారు. అంతలోనే పోలీసుల రాకను గమనించి కొందరు వెనక్కి వెళ్లిపోయారు. ఒకానొక దశలో పోలీసులతో కూడా వారు వాగ్వాదానికి దిగారు. కాగా దుండగులు వచ్చిన కారులో దుడ్డు కర్రలు ఉన్నట్లు సమాచారం.

Related Stories: