స్వచ్ఛతలో మేటిగా..

- చెత్తకుండీలు లేని నగరం దిశగా అడుగులు.. - వ్యర్థాల నిర్వహణలో బల్దియా కార్యప్రణాళిక - అధికారులకు బాధ్యతల అప్పగింత సిటీబ్యూరో/ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ : నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ ద్వారా నగరాన్ని దశలవారీగా చెత్తకుండీలు లేని నగరంగా తీర్చిదిద్దే దిశగా జీహెచ్‌ఎంసీ పక్కా ప్రణాళికను రూపొందించింది. దీని అమలు కోసం అధికారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పనులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకుంటూ లోపాలను సరిదిద్దుకోవాలని, ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ(ఓడీఎఫ్ )ను కాపాడుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని నిశ్చయించారు. నిర్మాణ వ్యర్థాలు రోడ్లపై ఉండకుండా చూడాలని, ఫుట్‌పాత్‌లు సైతం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంకల్పించారు. ముఖ్యంగా ప్రతి సర్కిల్‌లో కనీసం 2500 ఇండ్లను ఒక యూనిట్‌గా తీసుకొని పారిశుధ్య నిర్వహణలో మైక్రోప్లానింగ్‌ను రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ ర్యాంకుల్లో ఈ ఏడాది నగరానికి ఆశించిన స్థాయిలో ర్యాంకు రాకపోవడంతో స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇప్పటికే నగరానికి ఓడీఎఫ్ నగరంగా గుర్తింపు లభించినందున దీన్ని కాపాడుకోవడంతోపాటు స్వచ్ఛతలో నగరాన్ని మేటి నగరంగా తీర్చిదిద్దాలని బల్దియా అధికారులు నిర్ణయించారు. వరుసగా మూడు దఫాలు స్వచ్ఛతలో ప్రథమ ర్యాంకు సాధించిన ఇండోర్ నగరాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా స్వచ్ఛ హైదరాబాద్-షాన్‌దాన్ హైదరాబాద్ పేరుతో నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు కార్యప్రణాళికను సిద్ధం చేశారు. ఇంటింటి చెత్త సేకరణ, సోర్స్ సెగ్రిగేషన్, వాణిజ్య ప్రాంతాల్లో వ్యర్థాల తొలిగింపుపై ప్రత్యేక దృష్టి, రోడ్ల స్వీపింగ్, క్రమం తప్పకుండా చెత్త కుండీలు ఖాళీ చేయడం, రోడ్ల వెంబడి, బహిరంగ ప్రదేశాల్లో నిర్మాణ వ్యర్థాలు లేకుండా వాటిని సేకరించి నిర్దేశిత ప్రదేశంలో వేయడం, ఓడీఎఫ్ ను కాపాడుకోవడం, బల్క్ గార్బేజ్ ఉత్పత్తిచేసే సంస్థల్లో కంపోస్ట్ ఎరువు తయారీ, డ్రైనేజీ పొంగిపొర్లకుండా చూడడం, ఫుట్‌పాత్‌ల మరమ్మతులు, ఫ్లెక్సీలు-పోస్టర్లు-బ్యానర్ల తొలిగింపు, గార్డెన్ వ్యర్థాల తొలిగింపు, వ్యర్థాల కాల్చకుండా చూడడం తదితర అంశాలు ఈ కార్యప్రణాళికలో ఉన్నాయి. ఈ అంశాలు క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించి ఈ మేరకు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. నిరంతర పర్యవేక్షణ... స్వచ్ఛ కార్యప్రణాళికను అమలు చేసేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా కమిషనర్, అదనపు కమిషనర్, జోనల్ కమిషనర్లు ప్రధాన కార్యాలయం స్థాయిలో పర్యవేక్షకులుగా ఉంటారు. ఉప కమిషనర్లు, వైద్యాధికారులు, పర్యావరణ నిపుణులు క్షేత్రస్థాయిలో విధులను పర్యవేక్షిస్తారు. శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ జవాన్‌లు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు, స్వీపర్లు, గార్బేజ్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనులు నిర్వహిస్తారు. కాగా, ఇండోర్‌కు చెందిన స్వచ్ఛ బృందం నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, ఐటీసీ కోఆర్డినేటర్లు క్షేత్రస్థాయిలో పనులకు సహాయకారులుగా ఉంటారు. సంపూర్ణ స్వచ్ఛత కోసం.. డివిజన్ల వారీగా ఎంపిక చేసిన ప్రాంతాలను సంపూర్ణ స్వచ్ఛత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఒక్కో డివిజన్‌కు నాలుగు స్వచ్ఛ ఆటో ట్రాలీలను, నాలుగు స్వచ్ఛ దూతలను ఇవ్వనున్నారు. తమకు కేటాయించిన డివిజన్‌లోని ఎంపిక చేసిన 2,500 నివాసాల్లో ప్రతి రోజు స్వచ్ఛ ఆటో ట్రాలీలు చెత్తను ఇంటింటికీ వెళ్లి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్వచ్ఛ ట్రాలీ డ్రైవర్ వెంట స్వచ్ఛ దూతలు కూడా వెళ్లి ప్రతి ఇంటి వారు తడి, పొడి చెత్తను స్వచ్ఛ ట్రాలీకి ఇచ్చేలా మోటీవేట్ చేయాల్సి ఉంటుంది. స్వచ్ఛతపై ఏ ఒక్క ఇంటిని కూడా వదలకుండా చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మూడు నెలల్లో సంపూర్ణ స్వచ్ఛత కాలనీలుగా తీర్చిదిద్దిన తర్వాత మరో ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటారని, ఈ సంపూర్ణ స్వచ్ఛత కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ఏఎంవోహెచ్ డాక్టర్ మల్లికార్జున్‌రావు పేర్కొంటున్నారు. అందులో భాగంగా ఎల్బీనగర్, సరూర్‌నగర్, హయత్‌నగర్ సర్కిళ్ల పరిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఉదయం 9 వరకు క్షేత్రస్థాయిలో అధికారులు : దానకిశోర్ స్వచ్ఛ కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా డిప్యూటీ కమిషనర్లు ప్రతిరోజు ఉదయం ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు క్షేత్రస్థాయిలో ఉండాలని, జోనల్ కమిషనర్లు కూడా తరచూ పనులను తనిఖీ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఆదేశించారు. వివిధ అంశాలపై గురువారం ఆయన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెత్త ట్రాన్స్‌ఫర్ స్టేషన్లను డిప్యూటీ కమిషనర్లు వారంలో రెండుసార్లు, వైద్యాధికారులు వారంలో మూడు సార్లు తనిఖీలు నిర్వహించాలన్నారు. అంతేకాకుండా రోడ్లపై వ్యర్థాలు వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని ఆదేశించారు. ప్రతి సర్కిల్‌లో కనీసం 2,500 ఇండ్లను ఒక యూనిట్‌గా తీసుకొని పారిశుధ్య నిర్వహణలో మైక్రోప్లానింగ్‌ను రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు.

Related Stories: